క్రిప్టో కరెన్సీ పై నిషేధం కుదరదన్న ప్రభుత్వం
దేశంలో క్రిప్టో కరెన్సీ పై నిషేధం విధించాలా వద్దా అని కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.
క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని ఆర్బీఐ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే బ్యాన్ విధించడం కుదరదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్రిప్టో కరెన్సీల రెగ్యులేషన్ పై సోమవారం లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ భారత ఎకానమీపై క్రిప్టోకరెన్సీ చూపగల ప్రతికూల ప్రభావం మీద రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ బ్యాన్ విధించాలంటే అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె అన్నారు. . రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్ ని నివారించాలంటే ఇలాంటి సహకారం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇండియాలో ఈ కరెన్సీ ని కంట్రోల్ చేయడంపై తగిన చట్టాన్ని తేవాలని రిజర్వ్ బ్యాంక్ ఏ సూచన అయినా చేసిందా ? దీనిపై కేంద్ర వైఖరి ఏమిటని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అసలిది కరెన్సీయే కాదని, ఏ తాజా కరెన్సీ నైనా తాము లేదా ప్రభుత్వమే జారీ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయని ఆమె చెప్పారు. ప్రస్తుత కరెన్సీ విలువను మానిటరీ పాలసీ నిర్దేశిస్తుందని, హై రిటర్నులు వస్తాయన్న ఊహాగానాలు, ఆశలపైనే క్రిప్టో కరెన్సీ నడుస్తోందని,కానీ వీటికి సరైన ప్రాతిపదిక లేదని బ్యాంక్ అభిప్రాయపడుతోందని ఆమె చెప్పారు. ఈ కారణంగా మన దేశ ద్రవ్య సుస్థిరతపై ఇది దుష్ప్రభావాన్ని చూపుతుందని రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తోందన్నారు
కాగా- క్రిప్టో కరెన్సీపై లోగడే కేంద్రం స్పందించింది. గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదించేందుకు అనువుగా కేంద్రం 'క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ' బిల్లును తెచ్చింది. అంటే.. అధికారిక డిజిటల్ కరెన్సీని సృష్టించి దీన్ని ఆర్బీఐ జారీ చేయడానికి వీలైన ఓ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. అలాగే ఇండియాలో ఈ కరెన్సీకి సంబంధించిన టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి గల అవకాశాలను మినహాయించి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలనన్నింటినీ నిషేధించాలని కూడా ఇందులో పేర్కొన్నారు. కానీ ఈ బిల్లు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
వర్చ్యువల్ డిజిటల్ ఎస్సెట్స్ బదలాయింపు లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయంపై 30 శాతం పన్నును విధిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ గత ఫిబ్రవరిలో చేసిన తమ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక గల ఉద్దేశం ఈ లావాదేవీల ఫ్రీక్వెన్సీ మీద దృష్టి పెట్టడమేనన్నారు. అలాగే ఖరీదైన డిజిటల్ ఎస్సెట్లను గిఫ్ట్ గా ఇచ్చినప్పటికీ దానిపై కూడా పన్ను ఉంటుందన్నారు. కానీ ఈ ఎస్సెట్ల పరిధి కిందకు ఎన్ని వస్తువులు వస్తాయో ఆమె స్పష్టం చేయలేదు.
బహుశా వీటిని సైతం క్రిప్టోకరెన్సీలో చేర్చారా అన్నది అప్పుడు చర్చనీయాంశమైంది. గత పదేళ్లలో క్రిప్టో ఇండస్ట్రీ చిన్నపాటి డెవెలపర్ల నుంచి క్రమంగా ఎదుగుతూ ట్రిలియన్ డాలర్ల గ్లోబల్ ఎకానమీగా మారిపోయింది. దీనికి అత్యాధునిక టెక్నాలజీ కూడా తోడయింది. లక్షలాది యూజర్లు దీనిపై ఆసక్తి చూపుతూ వచ్చారు. ప్రస్తుత ఎకానమీకి సంబంధించిన ఎకో సిస్టంలను మార్చివేయగల సత్తాకు క్రిప్టోకరెన్సీ చేరుకుంది. అయితే క్లిష్టతరమైన సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ డిజిటల్ ఎస్సెట్ల వాడకంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఎస్సెట్ల సుస్థిరతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. క్రిప్టోకరెన్సీపై ప్రపంచ నిపుణుల్లో కొందరు విభేదించారు. ఓ గ్రూపు దీనికి అనుకూలంగా, మరో గ్రూపు దీని వికేంద్రీకృత 'లక్షణాన్ని' బూచిగా చూపి అసంతృప్తి వ్యక్తం చేసింది
బిట్ కాయిన్ ని చట్టబద్ధమైన కరెన్సీగా గత ఏడాది ఎల్ సాల్వడార్ దేశమొక్కటే గుర్తించింది. కానీ ఇతర దేశాలు దీన్ని డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ , టెర్రరిజం వంటి అక్రమ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చునన్న ఆందోళనను వ్యక్తం చేశాయి. పైగా తమ ప్రస్తుత మానిటర్ సిస్టంలకు ఇది ముప్పు తేవచ్చునని కూడా భావించాయి. చైనా, ఈజిప్ట్, ఖతార్, వియత్నామ్ వంటి పలు దేశాలు క్రిప్టోకరెన్సీ వినియోగాన్ని నిషేధించాయి.
బహుశా ఈ నేపథ్యంలోనే భారతీయ రిజర్వ్ బ్యాంక్ క్రిప్టోకరెన్సీని నిషేధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు కనిపిస్తోంది. అయితే దీనికి అంతర్జాతీయ దేశాల సహకారం అవసరమని మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారంటే.. దీని వెనుక ఏదో బలమైన కారణమొకటి ఉండి ఉండాలి.