ఆ రెండు బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ జరిమానా
రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే ఈ రెండు బ్యాంకులకు జరిమానా విధించామని ఆర్‌బీఐ తెలిపింది. ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ప్రైవేటు రంగ బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు గాను ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. ఈ మేరకు మంగళవారం ఈ వివరాలు వెల్లడించింది. లోన్ అడ్వాన్సులు, చట్టబద్ధమైన ఇతర నిబంధనలతో పాటు కమర్షియల్ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐకి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపింది.
అలాగే ఆర్థిక సేవల అవుట్ సోర్సింగ్ రిస్క్‌లు, ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, రికవరీ ఏజెంట్లు, కస్టమర్ సర్వీసుకు సంబంధించి నిర్దేశిత నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95 కోట్లు చొప్పున ఈ జరిమానా వేసినట్టు వెల్లడించింది.
రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే ఈ రెండు బ్యాంకులకు జరిమానా విధించామని ఆర్‌బీఐ తెలిపింది. ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఈ సందర్భంగా స్పష్టంచేసింది. ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కూడా ఆర్‌బీఐ రూ.5.39 కోట్ల జరిమానా విధించింది. కేవైసీ సహా కొన్ని నిబంధనలు పాటించడంలో విఫలమైనందు వల్ల ఈ చర్య తీసుకుంది.