8 బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమానా
రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ కింద రూపొందించిన నిబంధనలను బ్యాంకులు ఏ సందర్భంలోనైనా పాటించాల్సిందే. లేని పక్షంలో రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది
నిబంధనల్లో అలసత్వం, ఆర్బీఐ సూచనలను పాటించకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఏకకాలంలో 8 సహకార బ్యాంకులపై జరిమానా విధించింది. జరిమానా విధించిన బ్యాంకుల్లో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ కూడా ఉంది. ఈ బ్యాంకుకు ఆర్బీఐ రూ.55 లక్షల జరిమానా విధించింది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ఇటువంటి చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఇచ్చిన మార్గదర్శకాల గురించి బ్యాంకులను హెచ్చరిస్తుంటుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ కింద రూపొందించిన నిబంధనలను బ్యాంకులు ఏ సందర్భంలోనైనా పాటించాల్సిందే. లేని పక్షంలో రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది.
ఏయే బ్యాంకులకు ఎంతెంత జరిమానా అంటే..
* సహకార బ్యాంకులపై చర్యలకు సంబంధించి ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
* తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కైలాసపురంలో గల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.10 లక్షల జరిమానా విధించింది.
* కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా ఒట్టపాలన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకుకు రూ.5 లక్షల జరిమానా విధించింది.
* తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దారుస్సలాం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రూ.10 లక్షల జరిమానా విధించింది.
* ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహకార బ్యాంకుపై అత్యధికంగా రూ.55 లక్షల జరిమానా విధించింది. ఈ బ్యాంక్ ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ప్రొవిజనింగ్, హౌసింగ్ స్కీమ్‌ల ఫైనాన్స్‌కి సంబంధించిన సూచనలను ఉల్లంఘించిందని ఆర్బీఐ ఆరోపించింది.
* ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గాంధీ నగర్‌లోని నెల్లూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది.
* ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది.
* కేంద్ర పారా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 1 లక్ష, ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లోని నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ. 5 లక్షలు చొప్పున జరిమానా విధించింది.
రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే..
తాజాగా సహకార బ్యాంకులపై విధించిన జరిమానాలు రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. వారు తమ కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును నిరోధించడానికి ఉద్దేశించినది మాత్రం కాదని స్పష్టం చేసింది. కస్టమర్లు మునుపటిలా బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చని ఆర్బీఐ సూచించింది.