భార్య ఎమ్మెల్యేగా గెలిచింది.. బంగ్లాదేశ్ పయనం అవనున్న రవీంద్ర జడేజా!
గుజరాత్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా.. జామ్‌నగర్ (నార్త్) నియోజకవర్గం నుంచి దాదాపు 60 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందినట్లు తెలుస్తున్నది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి విజయం సాధించింది. 7వ సారి వరుసగా అధికారం చేజిక్కించుకొని బెంగాల్‌లో సీపీఎం నెలకొల్పిన రికార్డును సమం చేసింది. బీజేపీ తరపున భూపేంద్ర పటేల్ మరోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. ఈ నెల 12న భూపేంద్ర ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ చెప్పారు. గాంధీనగర్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నట్లు తెలుస్తున్నది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు గుజరాత్‌లో బీజేపీ 150 పైగా స్థానాల్లో విజయం/లీడ్‌లో ఉన్నది. ఇది గతంలో సాధించిన మెజార్టీ కంటే 50కి పైగా సీట్లు అదనమే. అయితే గుజరాత్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా.. జామ్‌నగర్ (నార్త్) నియోజకవర్గం నుంచి దాదాపు 60 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందినట్లు తెలుస్తున్నది. రివాబా.. తన సమీప ప్రత్యర్థి ఆఫ్ అభ్యర్థిపై భారీగా మెజార్టీ సాధించారు. ఇంకా ఎలక్షన్ కమిషన్ గెలుపు డిక్లరేషన్ ఇవ్వక ముందే రివాబా, రవీంద్ర జడేజా కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం గమనార్హం.
జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గంలో రవీంద్ర జడేజా, రివాబాతో కలిసి బీజేపీ నాయకులు ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా తరలి వెళ్లారు. కాగా, గత కొంత కాలంగా రవీంద్ర జడేజాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భార్య కోసమే బంగ్లాదేశ్ టూర్‌ను గాయం సాకు చూపి తప్పించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే భారత జట్టు రెండు వన్డే మ్యాచ్‌లలో ఓడిపోయింది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో బొటని వేలు గాయంతోనే బ్యాటింగ్ చేశారు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండడని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.
డిసెంబర్ 14 నుంచి కీలకమైన టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నది. ఫైనల్‌కు చేరుకోవాలంటే బంగ్లాదేశ్ సిరీస్‌తో పాటు స్వదేశంలో జరిగే ఆసీస్ సిరీస్ కూడా గెలుచుకోవాలి. దీంతో బంగ్లా టెస్టు సిరీస్‌కు రవీంద్ర జడేజాతో పాటు సీనియర్ క్రికెటర్లను తిరిగి బంగ్లాదేశ్ పిలిపిస్తున్నారు.
గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో ఇండియా-ఏ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం అభిమన్యు బంగ్లాదేశ్‌లోనే ఇండియా-ఏ జట్టుతో పర్యటిస్తున్నాడు. ఆ సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. ఇండియా సీనియర్ జట్టులోకి బ్యాటర్‌గా ఆయనను తీసుకుంటున్నారు. అయితే భారత జట్టును ఎవరు నడిపిస్తారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.
ఇక రవీంద్ర జడేజా కూడా టెస్టు జట్టుతో కలవనున్నట్లు తెలుస్తున్నది. జడేజాతో పాటు మహ్మద్ షమి టెస్టు జట్టులో ఉండనున్నారు. భార్య ఎన్నికలు కూడా పూర్తవడంతో జడేజా.. బంగ్లా టూర్‌లో భారత టెస్టు జట్టుతో కలవనుండటం దాదాపు ఖరారయ్యింది. అయితే, టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. రోహిత్ అందుబాటులో లేకుండా కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
#GujaratAssemblyPolls | BJP candidate from Jamnagar North, Rivaba Jadeja holds a roadshow in Jamnagar, along with her husband and cricketer Ravindra Jadeja.
— ANI (@ANI) December 8, 2022
As per official EC trends, she is leading with a margin of 50,456 votes over AAP candidate Karshanbhai Karmur. pic.twitter.com/TgnDKGJB9Z