జెండా కొంటేనే రేషన్
జాతీయ జెండా కొంటేనే రేషన్ ఇస్తామంటూ ఓ రేషన్ డీలర్ ప్రజలపై చేసిన ఒత్తిడి వివాదాస్పదమైంది. అధికారుల ఆదేశాల మేరకే తానావిధంగా చేశానని డీలర్ చెప్తున్నాడు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ 'హర్ ఘర్ తిరంగా' అంటూ పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న పలువురు బీజేపీ నేతలు, అధికారులు అనేక చోట్ల అత్యూత్సాహం చూపిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని బీజేపీ కార్యాలయంలో జెండాల అమ్మకం వివాదం సమసిపోకముందే హర్యాణాలో మరో వివాదం రాజుకుంది.
హర్యానాలోని కర్నాల్ లో ఓ రేషన్ షాపులో జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నాల్‌లోని ఒక న్యూస్ పోర్టల్ ఈ వీడియోను రికార్డ్ చేసిందని NDTV నివేదించింది. ఈ వీడియోలో పలువురు రేషన్ కార్డు హోల్డర్లు... ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపోలో రేషన్ తీసుకోవడానికి వెళ్లినప్పుడు జాతీయ జెండా కోసం రూ.20 చెల్లించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. రేషన్ కోసం తప్పని సరి పరిస్థితుల్లో జెండా కొనాల్సి వస్తోందని ప్రజలు ఆరోపించారు.
ఈ వీడియోలో రేషన్ డీలర్ కూడా మాట్లాడాడు. పై అధికారుల ఆదేశం మేరకే తానీ విధంగా చేయాల్సి వస్తోందని ఆయన చెప్పారు. రేషన్ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికీ జెండాను రూ.20కి విక్రయించాలని సీనియర్ అధికారులు తనను ఆదేశించారని ఆయన చెప్పారు.
"జెండా కొనడానికి నిరాకరించిన వారికి రేషన్ ఇవ్వవద్దని మాకు అధికారులు చెప్పారు. వాళ్ళు ఆజ్ఞాపించినట్లు మేము చేయాలి కదా" అని అతను అన్నాడు.
आजादी की 75वीं वर्षगाँठ का उत्सव गरीबों पर ही बोझ बन जाए तो दुर्भाग्यपूर्ण होगा।
— Varun Gandhi (@varungandhi80) August 10, 2022
राशनकार्ड धारकों को या तिरंगा खरीदने पर मजबूर किया जा रहा है या उसके बदले उनके हिस्से का राशन काटा जा रहा है।
हर भारतीय के हृदय में बसने वाले तिरंगे की कीमत गरीब का निवाला छीन कर वसूलना शर्मनाक है। pic.twitter.com/pYKZCfGaCV
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విపక్ష నాయకులేకాక స్వపక్ష నాయకులు కూడా ప్రభుత్వంపై విమర్షలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ బుధవారం ట్విటర్‌లో వీడియో షేర్ చేస్తూ రేషన్ కార్డ్ హోల్డర్లు తమ నెలవారీ వస్తువులను పొందేందుకు జాతీయ జెండాను బలవంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆరోపించారు. ''75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారితే అది దురదృష్టకరం. ప్రతి భారతీయుడి గుండెల్లో నిలవాల్సిన త్రివర్ణ పతాకం కోసం పేదల సొమ్మును లాగేసుకోవడం సిగ్గుచేటు.'' అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ సంఘటన పట్ల తీవ్రంగా స్పందించారు. బీజేపీ జాతీయవాదాన్ని అమ్ముకుంటోందని, పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు.
కాగా, జాతీయ జెండా కొంటేనే రేషన్ ఇస్తామన్న నిర్ణయం వివాదాస్పదమవడంతో అధికారులు స్పందించారు. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కర్నాల్ డిప్యూటీ కమిషనర్ అనీష్ యాదవ్ చెప్పారు. రేషన్ డీలర్ ప్రజలను తప్పుదారి పట్టించాడని ఆయన మండిపడ్డారు. డిపో యజమాని లైసెన్స్‌ను సస్పెండ్ చేసినట్లు అనీష్ యాదవ్ తెలిపారు. రేషన్ షాపుల్లో జాతీయ జెండాలను విక్రయించడం నిజమే అని, అయితే ఎవరికి అవసరమైతే వాళ్ళు కొనుక్కుంటారని బలవంతమేమీ లేదని యాదవ్ అన్నారు.
ఇక రేషన్ డీలర్ చెప్పింది నిజమా, అధికారులు చెప్తున్నది నిజమా అన్నది కొద్దిగా ఆలోచిస్తే ఎవరికైనా అర్దమవుతుంది. అది సరే, బలవంతంగా డబ్బులు తీసుకొని జెండాలు అంటగడితే వారిలో దేశభక్తి పెరిగిపోతుందా ? అయినా పెరగాల్సింది జెండాల అమ్మకమా ? దేశభక్తా ?