మొఘల్ గార్డెన్స్ పేరు అమృత్ ఉద్యాన్‌గా మార్పు
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గార్డెన్‌ను ఆదివారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉండే మొఘల్ గార్డెన్స్ పేరును 'అమృత్ ఉద్యాన్' గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. మొఘల్, బ్రిటిష్ కాలం నాటి ప్రముఖ కట్టడాలు, నిర్మాణాల పేర్లను కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజులుగా మార్చుతోంది. ఇటీవల రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, అమృత్ ఉద్యాన్‌గా పేరు మార్చిన ఈ గార్డెన్‌ను ఆదివారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్ వద్ద 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని మొగల్ గార్డెన్స్, తాజ్ మహల్ ముందున్న మొఘల్ గార్డెన్స్ తరహాలో ఈ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. 1917లో సర్ ఎడ్విన్ ల్యూటెన్స్ ఈ డిజైన్‌కు ఆమోదం తెలుపగా, 1929 నుంచి ఈ గార్డెన్లో పూల మొక్కలు నాటడం ప్రారంభించారు.
ఇక్కడ ఎన్నో రకాల పూల తోటలు, సరస్సులు ఉన్నాయి. ఏటా ఉద్యానోత్సవంలో భాగంగా ప్రజలు మొఘల్ గార్డెన్స్ ని సందర్శించడానికి అవకాశం ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది జనవరి 31 నుంచి మార్చి 26 వరకు అమృత్ ఉద్యాన్‌ను తెరిచి ఉంచనున్నారు. అలాగే మార్చి 28 నుంచి 31వ తేదీ వరకు రైతులు, దివ్యాంగులు, మహిళలు ఈ గార్డెన్స్ ని సందర్శించవచ్చు. కాగా, మొగల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చడంపై బీజేపీ ప్రశంసించింది. ఇది మోడీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అభివర్ణించారు.