Telugu Global
National

'రేపిస్ట్‌లు హీరోలు అవుతున్నారు..ఇది మ‌హిళ‌లంద‌రికీ అవ‌మాన‌క‌రం': బిల్కిస్ బానో భర్త

తన భార్యను సామూహిక అత్యాచారం చేసిన రేపిస్టులు జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకుంటే ఉంటే మేము భయంతో బతుకుతున్నాం అని బిల్కిస్ బానో భర్త రసూల్ అన్నారు. ఇక మేము భ‌యంలేకుండా ఎలా జీవించ‌గలం,మా పిల్లల భ‌విష్య‌త్తు ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

రేపిస్ట్‌లు హీరోలు అవుతున్నారు..ఇది మ‌హిళ‌లంద‌రికీ అవ‌మాన‌క‌రం: బిల్కిస్ బానో భర్త
X

ఎంతో సంచ‌ల‌నం రేపిన గోద్రా అల్ల‌ర్లు, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ సంఘ‌ట‌న‌లు కంటే ఈ కేసులో నిందితులు శిక్షాకాలం కన్నా ముందుగానే విడుద‌ల‌వ‌డం మ‌రింత సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. 11 మంది నిందితులను 1992 నాటి గుజ‌రాత్ రెమిష‌న్ విధానం ప్ర‌కారం విడుద‌ల చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా నిర‌స‌న‌లు, విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మేధావులు, న్యాయ‌నిపుణులు, విద్యాధికులు సైతం గుజ‌రాత్ ప్ర‌భుత్వ‌చ‌ర్య‌ను తీవ్రంగా నిర‌సిస్తున్నారు. ఈ నేపథ్యంలో దారుణానికి బ‌లై దాదాపు రెండు ద‌శాబ్దాలుగా జీవ‌చ్ఛ‌వాలుగా బ‌తుకుతున్న బిల్కిస్ బానో కుటుంబం నిందితుల విడుద‌లను జీర్ణించుకోలేక‌పోతున్న‌ది. ఈ నిందితుల్లో ఒక‌రొక‌రు పెరోల్ పై వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తాము భ‌యంతో బిక్కిబిక్కుమంటూ గ‌డిపేవార‌మ‌ని, ఏకంగా ఇప్పుడు నిందితులు అంతా బ‌య‌టికి రావ‌డంతో త‌మ బ్ర‌తుకులు ఎలా ఉంటాయోన‌ని భ‌యంగా ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ బిడ్డ‌ల భ‌విష్య‌త్తు ఏమికానున్న‌దోన‌ని ఆవేద‌న చెందుతున్నారు.

ఈ నేప‌ద్యంలో అజ్ఞాత ప్ర‌దేశం నుంచి బిల్కిస్ బానో భ‌ర్త యాకూబ్ ర‌సూల్ ఓ ఆంగ్ల వెబ్ సైట్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. హేయ‌మైన నేరం చేసిన వ్య‌క్తులు నేడు సెలిబ్రెటీల మాదిరి స‌న్మానాలు, ఉత్సవాలు జ‌రుపుకుంటున్నార‌ని ర‌సూల్ అన్నారు. ఈ నిందితుల విడుద‌ల దేశంలోని మ‌హిళ‌లంద‌రికీ అవ‌మానక‌రం అని అన్నారు. త‌మ 18 యేళ్ళ‌న్యాయ‌ పోరాటం నిష్ప్ర‌యోజ‌న‌మైపోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇన్నాళ్ల త‌మ వేద‌న‌, భ‌యంక‌ర జీవితం, బిల్కిస్ బానో భ‌యాల గురించి వివ‌రించారు. ఆయ‌న మాట‌ల్లోనే...

'నిందితుల విడుద‌ల విష‌యం గురించి సోష‌ల్ మీడియాలో చూసిన వారు చెబితే మొద‌ట నేను న‌మ్మ‌లేదు. ఫొటోలు చూసిన త‌ర్వాత న‌మ్మాల్సి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని మెల్లిగా నా భార్య బానోకి చెప్పాను. ఆమె నిర్ఘాంత‌పోయింది. ఎందుకు త‌న‌కే ఇలా జ‌రుగుతోంద‌ని ఏడ్చింది. భ‌య‌ప‌డింది. మొద్దుబారిపోయింది. అప్ప‌టినుంచీ ఎవ‌రితోనూ మాట్లాడ‌డం లేదు.'

దేశంమా వైపు ఉంది..అదే ఓదార్పు..

'వారి మంచి నడవడిక కారణంగా' జైలునుంచి బయటికి వ‌చ్చార‌ని మాకు చెప్పారు. ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులను విడుదల చేయడానికి సమీక్షా కమిటీకి ఈ వ్యక్తులు జైలులో ఎలాంటి మంచి ప్రవర్తనను చూపించారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.' అని ర‌సూల్ అన్నారు. వారి విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలు ఏవీ మాకు అందలేదు. మేము విడుదల కాపీని అడిగాము, అవి వ‌చ్చిన త‌ర్వాత మా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటాం అన్నారు. అయితే మేము ఇంత బాధ‌లో ఉన్నా దేశం మొత్తం మమ్మల్ని ఆదరించడం కొంత ఓదార్పుగా, ఊర‌ట‌గా ఉందన్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోరాడడం నుండి ముంబై కోర్టుకు బదిలీ చేయడం వరకు కేసును సిబిఐకి బదిలీ చేయడం వరకు మేము దీనిపై రెండు దశాబ్దాల పాటు వివిధ‌ కోర్టుల్లో పోరాడాము. ప్రత్యేక సీబీఐ కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత వారు హైకోర్టులో అప్పీలు చేయగా, అది కూడా తీర్పును సమర్థించింది. 2019లో, మాకు రూ. 50 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పరిహారంగా అందించినప్పుడు, మా జీవితాల‌ను మేము మళ్లీ ప్రారంభించాలని అనుకున్నాము. మేము మా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని ఆలోచించినప్పుడు, మాకు ఈ షాకింగ్ వార్త తెలిసింది అన్నారు ర‌సూల్.

ఇక మేము భ‌యంలేకుండా ఎలా జీవించ‌గ‌లం.మా పిల్లల భ‌విష్య‌త్తు ఏమిటి..వారికి ఇప్పుడు అన్నీ తెలిశాయి. ఇన్నేళ్ల‌లో ఎన్ని ఇళ్ళు మారామో లేక్క‌లేదు. ఇప్పుడంటే మీడియా అంతా మా చుట్టూ తిరుగుతోంది. కొంత‌కాల‌మైన త‌ర్వాత మ‌ర్చిపోతారు. అప్పుడు మాకు భ‌ద్ర‌త ఏంటి అని భ‌యాందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇన్నేళ్ళ‌ మా బాధ‌ను క‌ళ్ళారా చూసిన మా బిడ్డ‌లు వారి భ‌విష్య‌త్తు గురించి ఆందోళ‌న చెందుతున్నారు. భ‌యంలేకుండా జీవించ‌గ‌ల‌రా.. వారి గ‌తేంటి అని ఆవేద‌న‌గా ప్ర‌శ్నించారు.

. "ఇది కేవలం బిల్కీస్ ను అవమానించడమే కాదు, ఈ దేశంలోని మహిళలందరినీ అవమానించడమే. రేపిస్ట్‌లను వారు హీరోలుగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు. దీనిని దేశం గ‌మ‌నిస్తోంది. ఎన్న‌టికీ ఈ దారుణాన్ని మ‌ర్చిపోదు." అని యూకూబ్ ర‌సూల్ వ్యాఖ్యానించారు. బిల్కిస్ ప్రస్తుతం మాట్లాడకపోవచ్చు కానీ ఆమె చూస్తోంది. రేపిస్టులు, హంతకులు ఎలా ఉత్సావాలు జరుపుకుంటున్నారో దేశం మొత్తం చూస్తోంది.

First Published:  21 Aug 2022 11:06 AM GMT
Next Story