నీ ఫొటో చూసి నచ్చాకే పికప్ కి వచ్చా..ర్యాపిడోలో రైడ్ బుక్ చేసిన మహిళకు చేదు అనుభవం
'మీరు రైడ్ బుక్ చేసుకున్న తర్వాత వాట్సాప్ లో మీ ప్రొఫైల్ ఫొటో చూశాను. మీ వాయిస్ కూడా నచ్చడంతో మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. లేదంటే అసలు పికప్ చేసుకోవడానికి వచ్చేవాడిని కాదు.'
ఆన్లైన్ బైక్ ట్యాక్సీ `ర్యాపిడో` వంటి సేవలు వచ్చిన తర్వాత నగరాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చులోనే వెళ్లే ఆస్కారం లభిస్తోంది. దీంతో చాలామంది బైక్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన పరిణామాలతో ఇటువంటి సేవలు ఎంత వరకు సురక్షితమైనవి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ ర్యాపిడో డ్రైవర్ నుంచి ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది.
హసన్ పరీ అనే మహిళ ఇటీవల ర్యాపిడోలో రైడ్ కోసం తన సెల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకుంది. ఆ తర్వాత కొంతసేపటికి డ్రైవర్ వచ్చి ఆమెను పికప్ చేసుకుని రైడ్ పూర్తయిన తర్వాత ఆమెను వదలి వెళ్లిపోయాడు. అయితే రైడ్ పూర్తయిన తర్వాత సదరు మహిళ తన ఫోన్ ను చూసుకోగా.. ర్యాపిడో డ్రైవర్ సెల్ నుంచి తన వాట్సాప్ కు మెసేజ్ లు వచ్చినట్లు గుర్తించింది.
అందులో.. 'మీరు రైడ్ బుక్ చేసుకున్న తర్వాత వాట్సాప్ లో మీ ప్రొఫైల్ ఫొటో చూశాను. మీ వాయిస్ కూడా నచ్చడంతో మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. లేదంటే అసలు పికప్ చేసుకోవడానికి వచ్చేవాడిని కాదు.' అని మెసేజ్ లు ఉన్నాయి. డ్రైవర్ చర్యపై ఆగ్రహించిన సదరు మహిళ అతడి తీరుపై ర్యాపిడో సంస్థకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది. ర్యాపిడో డ్రైవర్ పంపిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి సంస్థ దృష్టికి తీసుకువెళ్ళింది.
కాగా, ర్యాపిడో డ్రైవర్ అనుచిత ప్రవర్తనపై ఆ సంస్థ మహిళకు క్షమాపణలు చెప్పింది. వెంటనే సదరు డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటన ఏ నగరంలో జరిగిందో సదరు మహిళ తెలియజేయలేదు. కాగా ర్యాపిడో డ్రైవర్ అనుచిత ప్రవర్తనపై ఓ మహిళ ధైర్యంగా సంస్థకు ఫిర్యాదు చేయడం పట్ల నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆన్లైన్ ట్యాక్సీలు అంత సురక్షితమైనవి కావని, అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు మహిళలకు సూచించారు.