Telugu Global
National

జైలుకెళ్లి వచ్చినా.. బుద్ధి రాలేదు..

రేవాలోని సంజయ్ గాంధీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదికల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు నిర్ధారించారు

జైలుకెళ్లి వచ్చినా.. బుద్ధి రాలేదు..
X

ఎవ‌రినైనా జైల్లో ఎందుకు వేస్తారు.. ఏదైనా త‌ప్పు చేస్తే అందుకు త‌గినంత శిక్ష అనుభ‌వించాలి కాబ‌ట్టి. అక్కడ వారిని కాస్త కష్టపెట్టి, బుద్ది చెప్పి, మానవత్వం ఉన్న మనిషిలా మార్చి బయటకు పంపడం అన్నది జైలు శిక్ష అసలు ఉద్దేశ్యం.. కానీ, అది మాత్రం జరగటమే లేదు. ఇందుకు ఎన్ని కారణాలు ఉన్నాయో.. మార్పు రాని మాజీ ఖైదీలు చేస్తున్న ఆరాచకాలకు అన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి.

చేసిన నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించినా మార్పు రాకపోగా, గతంలో చేసిన నేరమే మళ్లీ చేశాడు ఓ దుర్మార్గుడు. మైనర్ పై అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన అతడు జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ ఐదేళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.



రాకేష్ వర్మ అనే వ్యక్తి 2012లో కోల్గ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దోషిగా తేలడంతో కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. జైలుకి వెళ్ళాడు.. అక్కడ మంచిగా ప్రవర్తించాడు. దీంతో జైలులో సత్ప్రవర్తన కారణంగా మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేశారు. ఏడేళ్ల శిక్ష పూర్తిచేసుకొని ఏడాదిన్నర క్రితం జైలు నుంచి బయటకు వచ్చాడు.. గ్రామంలో అందరిమధ్య తిరుగుతూ మాములుగానే కనపడ్డాడు. అయితే బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్రామంలో ఓ బాలిక కనిపించకుండా పోయింది. పాప అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. రెండు గంటలపాటు వెతికిన తర్వాత బాధిత బాలిక ఆచూకీ తెలిసింది.




రక్తసిక్తమైన స్థితిలో కనపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికంగా ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. తరువాత ఆమెను రేవాలోని సంజయ్ గాంధీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదికల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు నిర్ధారించారు. నిందితుడు రాకేష్ వర్మ బాలికపై అత్యాచారం చేసి ఆటోలో పారిపోయాడని తెలుసుకున్న పోలీసులు అత‌న్ని ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

First Published:  17 Aug 2023 4:57 PM IST
Next Story