Telugu Global
National

అత్యాచారం కేసులో దోషి.. అయినా జైలుకి వేలకొద్దీ రాఖీలు

ఈయనకు ప్రతి ఏడాదీ రక్షాబంధన్ సందర్భంగా వేలకొద్దీ రాఖీలు పోస్ట్ ద్వారా వస్తుంటాయి. వారం రోజులుగా డేరా బాబా కోసం పోస్టల్ లో 20వేల రాఖీలు వచ్చాయి. గతేడాది 27వేల రాఖీలు వచ్చాయి.

అత్యాచారం కేసులో దోషి.. అయినా జైలుకి వేలకొద్దీ రాఖీలు
X

రాఖీ పండగ రోజు సోదరులకు రాఖీలు కట్టడం ఆనవాయితీ. వేరే ప్రాంతంలో ఉన్నవారికి పోస్ట్ ద్వారా రాఖీలు పంపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు అక్కాచెల్లెళ్లు. అలా ఒక వ్యక్తికి వారం రోజులపాటు రోజూ పోస్ట్ ద్వారా రాఖీలు వస్తున్నాయంటే అతనెంత ఉన్నత భావాలు కలిగినవాడనుకోవాలి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20వేల రాఖీలు.. ప్రతి ఏడాదీ అతనికి పోస్ట్ ద్వారా వస్తుంటాయి. విచిత్రం ఏంటంటే.. ఇలా పోస్ట్ ద్వారా వేల రాఖీలు అందుకుంటున్న ఆ వ్యక్తి అత్యాచార కేసులో దోషి, హంతకుడిగా జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఆ రాఖీలన్నీ జైలు అడ్రస్ కే వస్తుంటాయి. అతడే గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. డేరా సచ్చాసౌదా అనే సంస్థ అధినేత, డేరా బాబాగా అందరికీ సుపరిచితుడు. ఆ డేరాబాబా జైలులో ఉన్నా కూడా వేలకొద్ది రాఖీలు ప్రతి ఏడాదీ అతనికి పోస్ట్ ద్వారా వస్తుంటాయి.

సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. రెండు హత్య కేసుల్లో ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. ప్రస్తుతం రోహ్ తక్ లోని సునారియా జైలులో శిక్షలు అనుభవిస్తున్నాడు డేరా బాబా. విచిత్రం ఏంటంటే.. అత్యాచార కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఈయనకు ప్రతి ఏడాదీ రక్షాబంధన్ సందర్భంగా వేలకొద్దీ రాఖీలు పోస్ట్ ద్వారా వస్తుంటాయి. వారం రోజులుగా డేరా బాబా కోసం పోస్టల్ లో 20వేల రాఖీలు వచ్చాయి. గతేడాది 27వేల రాఖీలు వచ్చాయి.

రక్షాబంధన్ రోజున డేరా బాబాకు గ్రీటింగ్ కార్డ్ లు, రాఖీలు పోస్ట్ ద్వారా ఇబ్బడి ముబ్బడిగా వస్తుంటాయి. రెండు వారాలపాటు నాన్ స్టాప్ గా రాఖీలు వస్తుంటాయి. వీటిని వేరు చేసి కట్టలు కట్టి, ప్రత్యేకంగా రిక్షాలు అద్దెకు తీసుకుని పోస్టల్ శాఖ జైలుకి తరలిస్తుంటుంది. రాఖీ పండగ వస్తుందంటే చాలు అక్కడి సిబ్బందికి ఇది అదనపు శ్రమ. నాలుగేళ్లుగా ఇలా పోస్టల్ శాఖ కు భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు డేరా బాబా.

First Published:  12 Aug 2022 3:51 PM IST
Next Story