Telugu Global
National

మాకూ పెళ్ళిళ్ళు కావాలంటూ పెళ్ళి కాని ప్రసాదుల పాదయాత్ర

కర్నాటక, పాత మైసూర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వందలాది మంది బ్రహ్మచారులు చామరాజనగర్ జిల్లాలోని మలే మహదేశ్వర కొండల పుణ్యక్షేత్రానికి మూడు రోజుల వాక్‌థాన్‌ను ప్రారంభిస్తున్నారు.

మాకూ పెళ్ళిళ్ళు కావాలంటూ పెళ్ళి కాని ప్రసాదుల పాదయాత్ర
X

ఈ మధ్య పెళ్ళి కాని ప్రసాదులు చాలా మందే ఉంటున్నారు. యువకులకు పెళ్ళి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకక అనేక తిప్పలు పడుతున్నారు. ఇది వినడానికి కామెడీగా అనిపించినా నిజానికి ఇది చాలా సీరియస్ సమస్య. ఈ సమస్యకు కారణం మన సమాజమే. ఆడ‌పిల్లలంటే చిన్న చూపు ఉన్న ఈ సమాజంలో బ్రూణ హత్యలు ఎన్ని లక్షలు జరిగి ఉంటాయో లెక్కలేదు. అమ్మాయి పుడుతుందని తెలియగానే గర్భస్రావం చేయించే కుటుంబాలు ఇప్పటికీ కోకొల్లలు. ఈ సమాజ తీరే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. పెళ్ళిళ్ళు కాని బ్రహ్మచారులు పెరిగిపోతున్నారు. అలాంటి బ్రహ్మ‌మచారులంతా ఒకచోట చేరి తమ బాధను ప్రపంచానికి చాటి చెప్పడానికి, తమకు పెళ్ళిళ్ళు జరిగేట్టు చూడాలని దేవుణ్ణి వేడుకోవడానికి ఈ నెల 23 న ఓ పెద్ద ర్యాలీ నిర్వహించబోతున్నారు.

కర్నాటక, పాత మైసూర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వందలాది మంది బ్రహ్మచారులు చామరాజనగర్ జిల్లాలోని మలే మహదేశ్వర కొండల పుణ్యక్షేత్రానికి మూడు రోజుల వాక్‌థాన్‌ను ప్రారంభిస్తున్నారు. బ్రహ్మచారుల పాదయాత్ర (బ్యాచిలర్స్ వాకథాన్) ఫిబ్రవరి 23న మండ్య తాలూకా మద్దూరులోని KM దొడ్డి నుండి ప్రారంభం కానుంది. దేశంలోని 'పెళ్లి కాని పురుషులందరికోసం వీళ్ళు దేవుడికి మొక్కుకోనున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఈ వాక్‌థాన్‌ను బ్యాచిలర్స్ స్వయంగా నిర్వహిస్తున్నారు. బెంగళూరు, మైసూరు, మాండ్య, శివమొగ్గ జిల్లాలకు చెందిన అవివాహిత పురుషులందరూ ఇందులో పాల్గొనవచ్చు. పాదయాత్ర లేదా ర్యాలీ సమయంలో నిర్వాహకులు భోజనం, వసతి కూడా కల్పిస్తారు. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుము లేదు.

అయితే ఈ సమస్య పరిష్కారానికి ర్యాలీలు, సభల వల్ల ఉపయోగంలేదని, మనం తప్పుచేసి దేవుణ్ణి వేడుకుంటే ఏం ప్రయోజనమని రైతు నాయకురాలు సునంద జయరామ్ అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం మహిళా కేంద్రీకృత సమాజం మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

మైసూరు నుండి 40 కి.మీ దూరంలో ఉన్న మాండ్య జిల్లా, ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులు, వ్యవసాయ‌ కార్మికులే ఎక్కువగా ఉంటారు.ఇక్కడ‌ 50 ఏళ్ళు వచ్చినా పెళ్ళికాని వాళ్ళు చాలా మంది కనిపిస్తారు.

First Published:  12 Feb 2023 7:26 AM IST
Next Story