కంగనా వ్యాఖ్యలపై టికాయత్ సీరియస్
సాగు చట్టాలు మళ్లీ తీసుకురావాలని కంగనా వ్యాఖ్యలపై స్పందించాలంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడి లేఖ
రైతుల విషయంలో బీజేపీ ఎంపీ, నటీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే కంగనా వ్యాఖ్యలపై స్పందించాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. కర్షక వర్గాన్ని కంగనా రనౌత్ పదే పదే లక్ష్యంగా చేసుకుంటున్నారని, తద్వారా గ్రామీణ ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని అతిపెద్ద పార్టీని నడిపించడం, దాని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీపై ఉన్నది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ స్థానానికి పోటీ చేయడానికి మీ పార్టీ దేశ వాస్తవికతలపై అంతగా అవగాహన లేని అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేసింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంగనా రనౌత్ దేశంలోని వ్యవసాయ సమాజాన్ని పదే పదే లక్ష్యంగా చేసుకుంటూ, గ్రామీణ ప్రజలను అవమానిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ కంగనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.
సాగు చట్టాలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే?
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. 'వివాదాస్పదమైన మూడు సాగు చట్టాలకు కొన్ని రాష్ట్రాల నుంచే వ్యతిరేకత వచ్చింది. రైతు ప్రయోజనం కోసం వాటిని మళ్లీ తీసుకురావాలని చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నా' అని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్షాల నుంచి, రైతు సంఘాల నాయకుల నుంచి పెద్ద ఎత్తును విమర్శలు వచ్చాయి. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఖండించారు. బీజేపీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నది. కంగన వ్యాఖ్యలను బీజేపీ విభేదించడం ఇది రెండోసారిసారి. గత నెలలో రైతు ఉద్యమాలతో బంగ్లాదేవ్ పరిస్థితి వచ్చేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అప్పుడు కూడా పార్టీ దీనిపై విభేదించి ఆమెను మందలించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. అంతేకాదు ఆమె వ్యాఖ్యలకు బీజేపీ కూడా దూరంగా ఉండటంతో బుధవారం ఎక్స్ వేదికగా క్షమాణలు చెప్పారు.