Telugu Global
National

ఢిల్లీ స‌ర్వీసుల బిల్లు.. రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే త‌రువాయి.. - రాజ్య‌స‌భ‌లోనూ ఆమోదం

దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది.

ఢిల్లీ స‌ర్వీసుల బిల్లు.. రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే త‌రువాయి.. - రాజ్య‌స‌భ‌లోనూ ఆమోదం
X

ఢిల్లీ స‌ర్వీసుల బిల్లు (Delhi Services Bill)కు రాజ్య‌స‌భ‌లో ఆమోదం ల‌భించింది. గ‌త వారం లోక్‌స‌భ‌లో విపక్షాల ఆందోళ‌న‌లు, వాకౌట్‌ల న‌డుమ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. తాజాగా రాజ్య‌స‌భ‌లోనూ ఆమోదం పొంద‌డంతో ఈ బిల్లు చ‌ట్టంగా మారేందుకు ఇక రాష్ట్ర‌ప‌తి ఆమోదం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ బిల్లును రాజ్య‌స‌భ‌లో సోమ‌వారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 131, వ్య‌తిరేకంగా 102 ఓట్లు వ‌చ్చాయి.

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లు అంశంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించ‌లేద‌ని చెప్పారు. దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలనను అందించాలన్న లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చామ‌ని ఆయ‌న తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తొలిసారిగా తీసుకొచ్చారని అమిత్ షా అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన బిల్లులోని ఏ ఒక్క నిబంధననూ తాము మార్చలేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని బుజ్జగించేందుకే కాంగ్రెస్ గతంలో తీసుకొచ్చిన బిల్లును తానే వ్యతిరేకిస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలోని అధికారుల, ఉద్యోగుల విధులు, ఇతర సర్వీసులకు సంబంధించి నిబంధనలను రూపొందించేందుకు కేంద్రానికి అధికారం వస్తుందన్నారు.

దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపాయి.

ఢిల్లీలో గ్రూపు-ఎ అధికారుల బ‌దిలీలు, నియామ‌కాలు, క్ర‌మశిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు గాను `నేష‌న‌ల్ కేపిట‌ల్ సివిల్ స‌ర్వీస్ అథారిటీ` ఏర్పాటు చేయాల‌న్న‌ది కేంద్రం ప్ర‌తిపాద‌న‌. దీనిపై ఆప్ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా, రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఆ అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని మే 11న అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పు చెప్పింది. అయితే అదే నెల 19న కేంద్రం దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసింది. తాజాగా పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతుండ‌టంతో దానిని బిల్లు రూపంలో తెచ్చింది.

First Published:  8 Aug 2023 6:49 AM IST
Next Story