Rajinikanth: నా ఫొటోలతో సహా ఏవీ వాడొద్దు - రజనీ లీగల్ వార్నింగ్
Rajinikanth: రజనీకాంత్ సెలబ్రెటీ హోదాలో ఉన్నారని.. వ్యాపారపరంగా ఆయన పేరును, ఫొటోలను వాడుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంటుందని నోటీసుల్లో వివరించారు. కొందరు మాత్రం రజనీకాంత్ ఫొటోలను, వీడియోలను, వాయిస్‌ను స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు.
సూపర్ స్టార్ రజనీ కాంత్ జారీ చేసిన లీగల్ వార్నింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇకపై ఎవరూ కూడా తన అనుమతి లేకుండా తన ఫొటోలను గానీ, వీడియోలను గానీ, తన వాయిస్‌ను గానీ వాడొద్దని పబ్లిక్ నోటీసు జారీ చేశారు. రజనీకాంత్ తరపు న్యాయవాది ఈ నోటీసు విడుదల చేశారు.
రజనీకాంత్ సెలబ్రెటీ హోదాలో ఉన్నారని.. వ్యాపారపరంగా ఆయన పేరును, ఫొటోలను వాడుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంటుందని నోటీసుల్లో వివరించారు. కొందరు మాత్రం రజనీకాంత్ ఫొటోలను, వీడియోలను, వాయిస్‌ను స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు. కొందరు రజనీకాంత్ పేరును వాడుకుంటూ తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. అందుకే ఇకపై రజనీకాంత్ అనుమతి లేకుండా ఆయనకు సంబంధించిన ఫొటోలనుగానీ, వీడియోలను గానీ, వాయిస్‌ను గానీ వాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు.
చాలా ప్రాంతాల్లో చిన్నచిన్న వ్యాపారులు, దుకాణదారులు తన షాపుల మీద, వస్తువుల మీద రజనీకాంత్ బొమ్మను వేసుకుంటూ ఉంటారు. అయితే రజనీకాంత్ నోటీసుల జారీకి ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా కారణమని చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో పెళ్లికి ముందు తాను సిగరెట్లకు, మద్యానికి, మాంసానికి బానిసైపోయిన విధానాన్ని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రసంగాన్ని కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు వివాదాస్పదం చేశాయి. ఈ నేపథ్యంలోనే తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడకుండా నియంత్రించేందుకు రజనీకాంత్ ఈ లీగల్ నోటీసు జారీ చేసి ఉంటారని భావిస్తున్నారు.