రాజీవ్ హత్య కేసులో ఆరుగురు నిందితుల విడుదలకు 'సుప్రీం' ఆదేశం
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన నళిని , రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్, జైకుమార్ లను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్‌గాంధీని హత్య చేసిన విషయం తెలిసిందే.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్, జైకుమార్ లను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నళిని, ఆర్పీ రవిచంద్రన్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్ హత్య కేసులో నళిని మురుగన్, సంతన్, ఏజీ పెరారివళన్, జయకుమార్, రాబర్ట్ పాయస్, పీ రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. మేలో పెరారివళవన్ జైలు నుంచి విడుదలయ్యాడు.
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్‌గాంధీ హత్యకు ధను అనే మహిళ ఆత్మాహుతి బాంబుగా మారింది. మే 1999 నాటి ఉత్తర్వుల్లో, పెరారివళన్, మురుగన్, సంతన్, నళిని నలుగురు దోషుల మరణశిక్షను సుప్రీం కోర్టు సమర్థించింది.
అయితే, 2014లో, వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో 11 ఏళ్ల జాప్యం కారణంగా సంతాన్ , మురుగన్‌లతో పాటు పెరారివళన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 2001లో నళిని మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.
రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండానే తమను విడుదల చేయాలంటూ నళినీ , రవిచంద్రన్ లు వేసిన పిటిషన్‌ను హైకోర్టు జూన్ 17న తిరస్కరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం దాని అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తూ, 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పెరరివాలన్‌ను విడుదల చేయాలని మే 18న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇంతకు ముందు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జే. జయలలిత, ఎడప్పాడి కే పళనిస్వామి ఏడుగురు దోషులను విడుదల చేయాలని సిఫార్సు చేశారు. దోషులను విడుదల చేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ రాష్ట్రపతికి ఇటీవలే లేఖ రాశారు
టాడా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా రాజీవ్ హత్య కేసు....
రాజీవ్ గాంధీ హత్య కేసుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ కేసును మొదట టాడా కోర్టులో విచారణకు పెట్టారు. అక్కడి నుంచి ఇది సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో పెరారివళన్‌తో పాటు 26 మందికి ఉరిశిక్ష విధిస్తూ టాడా కోర్టు 1998 జూలై 28న తీర్పు చెప్పింది. అయితే 1999లో సుప్రీంకోర్టు పలువురి శిక్షల్లో మార్పు చేసింది. శాంతను, మురుగన్, పేరారివళన్, నళినిలకు మాత్రం ఉరిశిక్ష ఖరారు చేసింది. రాబర్ట్ ఫయాజ్, జయకుమార్, రవిచంద్రన్‌లకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవశిక్షగా మారుస్తూ, మిగిలిన 19 మంది శిక్షా కాలాన్ని తగ్గించింది. ఇదిలా ఉండగా 2000 సంవత్సరంలో నళిని ఉరిశిక్షను యావజ్జీవంగా మారుస్తూ నాటి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం తీర్మానం చేసింది. దాంతో తమను కూడా ఉరిశిక్ష నుంచి తప్పించాలని కోరుతూ పేరరివాలన్, శాంతను, మురుగన్ రాష్ట్రపతికి కారుణ్య విన్నపాలు చేశారు. ఆ అభ్యర్థన పెండింగ్‌లోనే వుండిపోయింది. కాగా అకారణంగా ముగ్గురి కారుణ్య పిటిషన్లను సుదీర్ఘకాలం పెండింగ్‌లో వుంచినందున వారి ఉరిశిక్ష రద్దు చేస్తున్నట్లు జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2014లో తీర్పునిచ్చింది. అయితే సుమారు మూడు దశాబ్దాల పాటు తాము శిక్ష అనుభవించామని, భారతశిక్షాస్మృతిలో ఏ నేరానికీ ఇంతకాలం శిక్ష లేదని, అందువల్ల తమను విడుదల చేయాలంటూ పేరరివాలన్, నళిని న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పేరరివాలన్ ఎట్టకేలకు విజయం సాధించారు. దీంతో మిగిలిన వారి విడుదలకు కూడా సుప్రీం పచ్చజెండా ఊపింది.