Telugu Global
National

రాహుల్ అధ్యక్షుడు కావాలంటూ రాజస్థాన్ పీసీసీ తీర్మానం

రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా తీర్మానం చేసిన మొదటి పీసీసీ కూడా రాజస్థాన్ కావడం గమనార్హం.

రాహుల్ అధ్యక్షుడు కావాలంటూ రాజస్థాన్ పీసీసీ తీర్మానం
X

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని రాహుల్ గాంధీ చెప్తుంటే.. రాజస్థాన్ పీసీసీ మాత్రం అందుకు విరుద్ధ‌మైన నిర్ణయాన్ని తీసుకుంది. ఏఐసీసీ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీని నియమించాలంటూ రాజస్థాన్ పీసీసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. జైపూర్‌లో భేటీ అయిన పీసీసీ ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుడిగా ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన పీసీసీ.. రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా తీర్మానం చేసిన మొదటి పీసీసీ కూడా రాజస్థాన్ కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల పీసీసీలు కూడా ఇదే విధంగా తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

రాజస్థాన్ పీసీసీ సమావేశం అనంతరం మంత్రి ప్రతాప్ సింగ్ కచారియా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలనే తీర్మానాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రతిపాదించినట్లు చెప్పారు. రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని, ఏఐసీసీ సభ్యులను నియమించే అధికారం రాబోయే జాతీయ అధ్యక్షుడికే కట్టబెడుతూ తీర్మానం చేశామని వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 400 మంది ప్రతినిధులకు గాను సగానికి పైగా సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత సచిన్ పైలెట్ గైర్హాజరైనట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సమావేశం జరుగుతున్న సమయంలో అశోక్ గెహ్లాట్ ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. కానీ తీర్మానాన్ని మంత్రితో సమావేశానికి పంపించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఎన్నిక అవసరం అయితే అక్టోబర్ 17న నిర్వహిస్తారు. అక్టోబర్ 19న అధ్యక్ష ఎన్నిక ఫలితం వెలువడనుంది. కాగా, రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలను చేపట్టాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. అయితే, మరోసారి ఆ పదవిలో తాను ఉండబోనని రాహుల్ గాంధీ వారితో చెప్పినట్లు తెలుస్తుంది. అలాంటి సమయంలో రాజస్థాన్ పీసీసీ తీర్మానం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

First Published:  18 Sept 2022 5:18 AM GMT
Next Story