ఈ చోద్యం ఎక్కడా చూసి ఉండరేమో.. పట్టుబడ్డ దొంగలకు సన్మానం
దొంగలకు దేహశుద్ధికి బదులు పూలమాలలతో సన్మానం
ఎక్కడైనా దొంగలు పట్టుబడితే ఎవరైనా ఏం చేస్తారు.. చెట్టుకు కట్టేసి పిచ్చ కొట్టుడు కొడతారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తారు. కొన్ని చోట్ల అయితే ప్రాణాలు కూడా తీస్తుంటారు. కానీ పట్టుబడ్డ దొంగలకు పూలమాలలతో అందరి సమక్షంలో సన్మానం చేయడం ఎక్కడైనా చూశారా? చూసి ఉండరు కదా.. ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
భరత్ పూర్ లో ఇద్దరు దొంగలు చోరీ చేసేందుకు వచ్చారు. ఓ ఇంట్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. చోరీ చేసేందుకు వచ్చి ఇద్దరు దొంగలు పట్టుబడ్డారన్న విషయం చుట్టుపక్కల వారందరికీ తెలిసింది. అయితే ఊరి ప్రజలంతా ఆ దొంగల్ని పట్టుకొని దేహశుద్ధి చేయలేదు. అప్పటికప్పుడు రెండు పూలమాలలను తెప్పించారు.
ఊరి ప్రజలంతా చూస్తుండగా.. వారిని ఆ దండలతో గ్రామస్తులు సన్మానించారు. ఆ సమయంలో ఫొటోలు కూడా తీశారు. ఫొటోలు తీసే సమయంలో గ్రామస్తులు ఫోజులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది.అయితే పట్టుబడ్డ తర్వాత తమను గ్రామస్తులు కొట్టకుండా దండలతో సన్మానం చేయడంతో ఆ ఇద్దరు దొంగలు ఆశ్చర్యపోయారు.
తాము ఇకనుంచి దొంగతనాలు చేయమని.. గ్రామస్తులందరి సమక్షంలో వారు ప్రకటించారు. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ వారికి దేహశుద్ధి చేసినా వారు చోరీలు చేయడం ఆపరని, ఇలా అందరి ముందు సన్మానిస్తే అవమానంగా భావించి దొంగతనాలు చేయడం మానేస్తారని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. పట్టుబడ్డ దొంగలను పూల మాలలతో సన్మానిస్తున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.