Telugu Global
National

దళిత బాలుడ్ని కొట్టి చంపారన్న మనస్తాపంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

రాజస్థాన్ లోని ఓ స్కూల్ లో అగ్రవర్ణాలు తాగే నీళ్ళను దళిత బాలుడు తాగాడనే ఆగ్రహంతో ఆ బాలుడిని ఓ అగ్రకుల టీచర్ కొట్టి చంపిన సంఘటన కలకలం రేపింది. ఆ సంఘటన‌తో కలత చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పానాచంద్ మేఘ్ వాల్ తన పదవికి రాజీనామా చేశారు.

దళిత బాలుడ్ని కొట్టి చంపారన్న మనస్తాపంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
X

దళిత బాలుడిని కొట్టి చంపారన్న మనస్తాపంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. పానాచంద్ మేఘ్ వాల్ అనే ఈ ఎమ్మెల్యే.. జలోర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తననెంతో బాధించిందని, దళితులు, బడుగు వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అడ్డుకోలేని ఈ పదవి తనకెందుకని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మన సామాజికవర్గ హక్కులను రక్షించలేని ఈ పదవిలో కొనసాగే హక్కు కూడా తనకు లేదన్నారు. ఎలాంటి పదవి లేకుండానే ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లాట్ కి రాజీనామా లేఖ పంపారు. దేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలోనూ దళితులమీద, బడుగు వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి.. అత్యాచారాలు, దౌర్జన్యాలకు లెక్క లేదు.. వీటిని చూస్తూ నేను పడుతున్న మానసిక క్షోభను మాటల్లో వర్ణించలేను. నా సామాజికవర్గాన్ని టార్చర్ పెడుతున్నారు అని మేఘ్ వాల్ పేర్కొన్నారు.

జలోర్ జిల్లాలో తొమ్మిదేళ్ల ఇంద్ర కుమార్ అనే బాలుడు స్కూల్లో మంచినీటి కుండను ముట్టుకున్నాడన్న కోపంతో ఓ స్కూలు టీచర్ కొట్టి చంపారు. ఈ సమాచారం తెలిసిన ఈ ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారు. బారన్-అతృ నియోజకవర్గానికి చెందిన ఈయన.. గత కొన్నేళ్లుగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, కానీ వారిని రక్షించేవారే లేకపోతున్నారని అన్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఖాకీలు తుది నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తున్నప్పటికీ .. చాలా కేసుల్లో నిమ్న వర్గాలకు న్యాయం జరగడంలేదు.. ఎన్నోసార్లు అసెంబ్లీలో నేనీ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చినా.. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు అని మేఘ్ వాల్ వాపోయారు.

జలోర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై స్పందించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఖిలాడీలాల్ బైర్వా విచారణ ప్రారంభించారు. ఇంద్రకుమార్ మరణానికి కారణమైన చైల్ సింగ్ అనే 40 ఏళ్ళ టీచర్ ని పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది, అయితే ఇది ముఖ్యం కాదని, దళితులు, అట్టడుగు వర్గాలపై జరుగుతున్న ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మేఘ్ వాల్ డిమాండ్ చేశారు.




First Published:  15 Aug 2022 10:18 PM IST
Next Story