కృష్ణమందిరం నిర్మించే వరకూ ఒక్క పూటే భోజనం.. రాజస్థాన్ మంత్రి శపథం
మదన్ దిలావర్ ఇటువంటి శపథాలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించేంతవరకు మెడలో పూలమాల వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు.
అయోధ్యలో నిన్న రామ మందిరం అత్యంత వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అయోధ్యలో రామ మందిరం సాకారం కావడంతో.. ఇక అదే రాష్ట్రంలోని మథురలో కృష్ణ మందిరం నిర్మించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మథురలో కృష్ణాలయం నిర్మించేంతవరకు రోజుకు ఒక పూటే భోజనం చేస్తానని రాజస్థాన్ కు చెందిన ఓ మంత్రి శపథం చేశారు.
రాజస్థాన్ కు చెందిన మదన్ దిలావర్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ఆయన విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలువగా.. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. అంత సీనియర్ నేత మథురలో కృష్ణమందిరం కట్టే వరకు రోజులో ఒక పూటే భోజనం చేస్తానని శపథం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
మదన్ దిలావర్ ఇటువంటి శపథాలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించేంతవరకు మెడలో పూలమాల వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఆయన ప్రతిజ్ఞ చేసినట్లుగానే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, మంత్రిగా కొనసాగిన సమయంలో ఒక్కసారి కూడా మెడలో పూలమాల వేసుకోలేదు.
అయోధ్యలో నిన్న రామ మందిరం ప్రారంభం కావడంతో సుదీర్ఘకాలం తర్వాత ఆయన మెడలో పార్టీ కార్యకర్తలు భారీ పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మరో ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో ఎలాగైతే రామ మందిరం నిర్మించారో, అలాగే మథురలో కృష్ణ మందిరం నిర్మించేంతవరకు రోజులో ఒక పూటే భోజనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞతో మదన్ దిలావర్ మరోసారి వార్తల్లో నిలిచారు.