Telugu Global
National

వ‌చ్చేది విమానాల్లో.. చేసేది ఏటీఎంల చోరీలు.. - రాజ‌స్థాన్‌కు చెందిన `మేవాఠ్‌ గ్యాంగ్‌` అరెస్ట్‌

రాజ‌స్థాన్‌కు చెందిన ఈ ముఠా తెలంగాణ‌, ఏపీ స‌హా వివిధ రాష్ట్రాల్లో ఏడేళ్లుగా ఈ త‌ర‌హా చోరీల‌కు పాల్ప‌డుతోంది. కోట్ల రూపాయ‌ల్లో డ‌బ్బు కొల్ల‌గొట్టారు.

వ‌చ్చేది విమానాల్లో.. చేసేది ఏటీఎంల చోరీలు.. - రాజ‌స్థాన్‌కు చెందిన `మేవాఠ్‌ గ్యాంగ్‌` అరెస్ట్‌
X

ఇదో కొత్త ర‌కం ఏటీఎం చోరీ ముఠా. వీరు ఏటీఎంని ప‌గ‌ల‌గొట్ట‌కుండానే అందులోని డ‌బ్బును కొట్టేస్తారు. అదెలా అంటే.. వీరు ఏటీఎం కార్డు ద్వారా.. ఏటీఎం మిష‌న్ నుంచి డ‌బ్బు డ్రా చేస్తారు. అయితే.. బ‌య‌టికి డ‌బ్బు వ‌చ్చే చివ‌రి క్ష‌ణంలో ఏటీఎంలోకి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేస్తారు. దీంతో వారికి డ‌బ్బు వ‌స్తుంది గానీ.. ఖాతాదారుడి ఖాతా నుంచి మాత్రం విత్‌డ్రా కాదు. ఈ ముఠాకు సంబంధించి రాజ‌స్థాన్ పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

ఈ గ్యాంగ్‌లో 100 మంది వ‌ర‌కు మోస‌గాళ్లు..

రాజ‌స్థాన్‌కు చెందిన `మేవాఠ్ గ్యాంగ్‌`గా పిలిచే ఈ ముఠాలో 100 మంది వ‌ర‌కు మోస‌గాళ్లు ఉన్నారు. ఈ ముఠా సభ్యులు రాజస్థాన్‌లోని భరత్‌పూర్, అల్వార్ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఏటీఎం కార్డులు తీసుకుని పది రోజులకోసారి తాము ఎంచుకున్న రాష్ట్రాలకు విమానాల్లో ప్రయాణిస్తారు. పోలీసులకు అనుమానం రాకుండా సూటూబూటు ధరించి గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద మోసాలకు తెరలేపుతారు. చోరీకి పాల్ప‌డే స‌మ‌యంలో ఇద్ద‌రేసి చొప్పున ఒక టీమ్‌గా ఏర్ప‌డ‌తారు. ఒక‌రు ఏటీఎం లోప‌ల‌, మ‌రొక‌రు ఏటీఎంకు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసే ప్రాంతంలో ఉంటారు. ఏటీఎం నుంచి వ‌చ్చిన డ‌బ్బు తీసుకునే చివ‌రి క్ష‌ణంలో ఏటీఎంకు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేస్తారు. దీనివ‌ల్ల ఏటీఎంలో నుంచి న‌గ‌దు బ‌య‌టికి వ‌స్తుందే గానీ.. సంబంధిత ఖాతాదారుడి ఖాతాలో మాత్రం విత్‌డ్రా జ‌ర‌గ‌దు.

తెలుగు రాష్ట్రాల్లో ఏడేళ్లుగా..

రాజ‌స్థాన్‌కు చెందిన ఈ ముఠా తెలంగాణ‌, ఏపీ స‌హా వివిధ రాష్ట్రాల్లో ఏడేళ్లుగా ఈ త‌ర‌హా చోరీల‌కు పాల్ప‌డుతోంది. కోట్ల రూపాయ‌ల్లో డ‌బ్బు కొల్ల‌గొట్టారు. తెలంగాణలోని భద్రాద్రి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో ఇటీవ‌ల డబ్బు కాజేసినట్టు ఫిర్యాదు అంద‌డంతో దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు వారి కోసం వ‌ల ప‌న్నారు. ఈ ముఠా స‌భ్యులు హైద‌రాబాద్ నుంచి విమానంలో రాజ‌స్థాన్‌కు బ‌య‌లుదేరార‌ని ప‌క్కా స‌మాచారంతో జైపూర్ విమానాశ్ర‌యంలో కాపు కాసి ప‌ట్టుకున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా డీగ్ ప్రాంతానికి చెందిన జుబేర్ (32), లుక్మాన్ డీన్ (37), సద్దాం (35), ముస్తాక్ (28), ఇద్రిస్ (29)గా నిందితుల‌ను గుర్తించారు. నిందితుల నుంచి 75 ఏటీఎం కార్డులు, రూ.2.31 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

*

First Published:  7 Sept 2023 10:50 AM IST
Next Story