Telugu Global
National

పోటీ ప‌రీక్ష‌ల పేప‌ర్ లీక్ చేస్తే.. జీవిత ఖైదే..!

2021 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆర్ఈఈటీ లెవల్-2 ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రద్దయ్యింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గతేడాది ఓ బిల్లును ఆమోదించింది.

పోటీ ప‌రీక్ష‌ల పేప‌ర్ లీక్ చేస్తే.. జీవిత ఖైదే..!
X

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించిన ప్ర‌శ్నాప‌త్రాల‌ను లీక్ చేస్తే జీవిత ఖైదు విధించాల‌ని నిర్ణ‌యించింది. గ‌తేడాదే ఈ అంశంలో నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌విధించేలా బిల్లుకు ఆమోదం తెలిపిన ప్ర‌భుత్వం దానిని మ‌రింత క‌ఠిన‌త‌రం చేస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ ట్విట్ట‌ర్ వేదికగా వెల్లడించారు.

'రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు ఉత్తమ విధానం రూపొందించాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించాలని ఆదేశించాం. పేపర్ లీక్ పై నమోదయ్యే కేసుల్లో శిక్షను మరింత పెంచే బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఉన్న పదేళ్ల శిక్షను జీవిత ఖైదుకు పెంచుతున్నాం' అని సీఎం గెహ్లాట్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

2021 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆర్ఈఈటీ లెవల్-2 ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రద్దయ్యింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గతేడాది ఓ బిల్లును ఆమోదించింది. పేపర్ లీకేజీకి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే బిల్లుకు 2022 మార్చిలో అక్కడి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తాజాగా ఆ శిక్షను మరింతగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో పేపర్ లీకేజీ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోంది. ముఖ్యంగా ఆర్ఈఈటీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం దర్యాప్తు చేపడుతుండగా.. దీన్ని సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఏడాది చివరలో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ప్రచారాస్త్రంగా మార‌నుంద‌ని భావించిన అక్క‌డి ప్ర‌భుత్వం వాటికి చెక్ పెట్టేందుకు తాజా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

First Published:  5 July 2023 7:46 AM IST
Next Story