Telugu Global
National

ఐదేళ్లకు మించి మాకెవరూ నచ్చరు.. రాజస్థాన్ ఓటరు విలక్షణ తీర్పు

రాజస్థాన్ లో ఓటర్లు ప్రతిసారి విలక్షణ తీర్పు ఇస్తుంటారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చేస్తుంటారు. బాధ్యతగా వారిని ప్రతిపక్షంలో కూర్చోబెడుతుంటారు.

ఐదేళ్లకు మించి మాకెవరూ నచ్చరు.. రాజస్థాన్ ఓటరు విలక్షణ తీర్పు
X

ఐదేళ్లకు మించి ఎవరికీ అవకాశం ఇచ్చేది లేదంటున్నారు రాజస్థాన్ ఓటర్లు. అది ఏ పార్టీ అయినా సరే తమ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోబోమని మరోసారి తేల్చి చెప్పారు. అధికార కాంగ్రెస్ ని కాదని, బీజేపీకి పట్టం కడుతున్నారు. ఫలితం అధికారికం కాకపోయినా రాజస్థాన్ లో బీజేపీదే అధికారం అని తేలిపోయింది. మేజిక్ ఫిగర్ ని బీజేపీ దాటి మరింత ముందంజలో దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 75 దగ్గర ఆగిపోయేలా ఉంది. గత ఎన్నికల్లో 70 స్థానాలు గెలిచి ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయిన బీజేపీ ఈసారి 110 వరకు బండిని లాగేలా ఉంది. మొత్తమ్మీద రాజస్థాన్ లో బీజేపీ విజయం ఖాయం కాబోతోంది.

ఒకసారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ..

రాజస్థాన్ లో ఓటర్లు ప్రతిసారి తమ విలక్షణ తీర్పు ఇస్తుంటారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చేస్తుంటారు. బాధ్యతగా వారిని ప్రతిపక్షంలో కూర్చోబెడుతుంటారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాబోతోంది. ఇప్పటి వరకూ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి ఈదఫా అధికారాన్ని కట్టబెడుతున్నారు రాజస్థాన్ ఓటర్లు. ఏడు దఫాలుగా అక్కడ ఇదే జరుగుతోంది, ఈసారి కూడా అది కంటిన్యూ అయింది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ ఉందని, సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని సీఎం గెహ్లాత్‌ ధీమాగా ఉన్నారు. మరోవైపు గెహ్లాత్ పై కోపంతో రగిలిపోతున్న యువనేత సచిన్ పైలట్ ని అధిష్టానం బుజ్జగించి సయోధ్య కుదిర్చినా ఫలితం లేకుండా పోయింది. సచిన్‌ పైలట్‌ ప్రచార పర్వంలో సంయమనం పాటించినా ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ లో పరాభవం తప్పేలా లేదు.


First Published:  3 Dec 2023 11:46 AM IST
Next Story