Telugu Global
National

ఏడాదికి కోటిన్నర జరిమానా.. ఆ టీసీ రైలెక్కాడంటే అందరికీ హడల్

చెన్నై డివిజన్లో పనిచేసే నందకుమార్ డ్యూటీలో ఉన్నాడంటే ఆరోజు చలాన్ల మోత మోగిపోయినట్టే లెక్క. ఎవర్నీ చూసీ చూడకుండా వదిలేయడు, టికెట్ లేకుండా రైలెక్కేసి ఆ తర్వాత ఎంత ప్రాధేయపడినా వినడు

ఏడాదికి కోటిన్నర జరిమానా.. ఆ టీసీ రైలెక్కాడంటే అందరికీ హడల్
X

రైలులో టీసీ జరిమానా రాస్తే మొత్తం కట్టేసేవాళ్లు కొందరు, ఎంతో కొంత లంచం ఇచ్చి తప్పించుకునేవారు ఇంకొందరు. అందరూ అలా ఆమ్యామ్యాలతో సంతృప్తి పడతారనుకోలేం. తప్పు చేస్తే జరిమానా మొత్తం చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టేవారు కూడా ఉంటారు. అలాంటి ఓ టీసీ నందకుమార్. డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్స్ పెక్టర్ (CTI) గా చెన్నై డివిజన్లో పని చేస్తున్న నందకుమార్ జరిమానా వసూళ్లలో రికార్డ్ సృష్టించాడు. ఏడాదికి ఏకంగా కోటీ 55 లక్షల రూపాయలు వసూలు చేసి రైల్వేకి అందించాడు. రైల్వే చరిత్రలోనే ఇది ఓ అరుదైన రికార్డ్ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది.


చెన్నై డివిజన్లో పనిచేసే నందకుమార్ డ్యూటీలో ఉన్నాడంటే ఆరోజు చలాన్ల మోత మోగిపోయినట్టే లెక్క. ఎవర్నీ చూసీ చూడకుండా వదిలేయడు, టికెట్ లేకుండా రైలెక్కేసి ఆ తర్వాత ఎంత ప్రాధేయపడినా వినడు. జరిమానా కట్టాల్సిందేనంటాడు, ముక్కుపిండి మరీ వసూలు చేస్తాడు. ఏడాదికి ఏకంగా 27,787 కేసులు రాశాడు. వీటిలో ప్యాసింజర్లు, లగేజీల కేసులు కూడా ఉన్నాయి.

దక్షిణ రైల్వేకి చెందిన మరో ఇద్దరు కూడా జరిమానాల వసూళ్లలో కోటి మార్కు దాటి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు. వారిద్దరినీ కూడా ప్రత్యేకంగా అభినందించింది రైల్వే సంస్థ. రోజలైన్ ఆరోక్య మేరీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 17,919 కేసులు నమోదు చేసి 1.03 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేశారు. సీనియర్ టికెట్ ఎగ్జామినర్ గా పనిచేస్తున్న శక్తివేల్ మొత్తం 18,384 కేసులు రాశాడు. 1.10 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేశాడు. వారందర్నీ రైల్వే సంస్థ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్లు వేసింది.



First Published:  19 March 2023 6:09 PM IST
Next Story