Telugu Global
National

బోగీల మాటున రైల్వే వ్యాపారం.. ప్రయాణికులపై పెను భారం

స్లీపర్ బోగీలు తొలగించి, వాటి స్థానంలో ఏసీ బోగీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. దీంతో సహజంగానే ప్రయాణికులకు ఏసీ బోగీలే దిక్కవుతున్నాయి. రేటు ఎక్కువైనా టికెట్ కొనక తప్పదు. తత్కాల్ లో బుక్ చేసుకోవాలంటే మరింత వాయింపుడు ఖాయం.

బోగీల మాటున రైల్వే వ్యాపారం.. ప్రయాణికులపై పెను భారం
X

సహజంగా రైలు ప్రయాణికుల్లో ఎక్కువమంది స్లీపర్ బోగీలు కోరుకుంటారు. అవి అందుబాటులో లేకపోతే ఏసీ బోగీలవైపు చూస్తారు. ఉద్దేశపూర్వకంగా స్లీపర్ బోగీలు తగ్గిస్తే ప్రయాణికులు ఏం చేస్తారు. చచ్చినట్టు ఏసీ ప్రయాణాలు చేస్తారు. ఏసీలో టికెట్ మామూలుగా దొరకపోతే రెట్టింపు చెల్లించి తత్కాల్ లో బుక్ చేసుకుంటారు. ప్రైవేటు వ్యాపారులు ఇలాంటి టెక్నిక్ లు ఉపయోగించి ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టారంటే అందులో లాభాపేక్ష ఉంటుంది. కానీ రైల్వే సైతం ఇలాంటి చీప్ టెక్నిక్స్ తో ప్రయాణికులపై భారం మోపుతుంటే ఏమనాలి. రైల్వే నిర్వహణ భారం నుంచి ప్రభుత్వం తప్పించుకోడానికే ఈ ఎత్తుగడ వేసింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ నుంచి ఢిల్లీ, హౌరా మార్గాల్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది. పండగ వేళ ప్రయాణికుల సంఖ్య రెట్టింపు ఉంటుంది. అయితే పండగల వేళ సాధారణ స్లీపర్ బోగీలు తొలగించి, వాటి స్థానంలో ఏసీ బోగీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. దీంతో సహజంగానే ప్రయాణికులకు ఏసీ బోగీలే దిక్కవుతున్నాయి. రేటు ఎక్కువైనా టికెట్ కొనక తప్పదు. తత్కాల్ లో బుక్ చేసుకోవాలంటే మరింత వాయింపుడు ఖాయం.

ఒక్క దక్షిణ మధ్య రైల్వేలోనే కాదు, దాదాపుగా అన్ని చోట్లా ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇప్పటికే రైల్వేలో రాయితీలకు మంగళం పాడారు అధికారులు. ఆమధ్య సాక్షాత్తూ రైల్వే మంత్రి సైతం ప్యాసింజర్ రైళ్లతో నష్టాలొస్తున్నాయని, మోదీ చెప్పడం వల్లే వాటిని నడుపుతున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇలా స్లీపర్ బోగీలు తగ్గించి, ఏసీ బోగీలు పెంచి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు.

అడిగేవారేరి..?

పెట్రోల్ రేటు పెంచినా, సిలిండర్ రేటు పెంచినా అడిగేవారు లేకపోవడంతో ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని వ్యవస్థలను ఇలా తమ ఇష్టానికి వాడుకుంటోంది కేంద్రం. తాజాగా రైల్వేలో రాయితీలు తగ్గించి, చార్జీలో మోత పెంచి ప్రయాణికులపై భారంమోపారు. అది చాలదన్నట్టు ఇలా బోగీల విషయంలో ప్రయాణికుల్ని మోసం చేస్తూ ఇబ్బంది పెడుతోంది రైల్వే.

First Published:  2 Nov 2022 11:33 AM IST
Next Story