రాహుల్ గాంధీపై అనర్హత వేటు... కాంగ్రెస్ శ్రేణుల దిగ్భ్రాంతి
సూరత్ కోర్టు ఆదేశం ఆధారంగా, లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి, ఆయన నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు వాయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటించే అవకాశం ఉంది.
పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు దోషిగా నిర్ధారించి, శిక్ష విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. రాహుల్ గాంధీ ఇకపై పార్లమెంటు సభ్యుడు కాదని లోక్‌సభ సెక్రటరీ జనరల్ పేరిట శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌కు ఎంపీగా ప్రాతినిద్యం వహిస్తున్నారు.
రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు అయ్యి, అతని శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేసి, నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి అనుమతించినప్పటికీ చట్టం ప్రకారం అతను పార్లమెంటు సభ్యునిగా అనర్హతకి గురయ్యారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా నేరానికి పాల్పడి కనీసం రెండేళ్ల జైలు శిక్షకు గురైన వెంటనే అటోమేటిక్ గాఅనర్హతకు గురవుతారని నిపుణులు చెప్తున్నారు.
సూరత్ కోర్టు ఆదేశం ఆధారంగా, లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి, ఆయన నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటించే అవకాశం ఉంది. రాహుల్ ను సెంట్రల్ ఢిల్లీలోని తన ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేయమని కోరవచ్చని సమాచారం.
ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటే రాష్ట్రపతి మాత్రమే చేయగలరని, ఈ చర్యకు చట్టబద్ధత ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
కాగా మాజీ కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ రాహుల్ అనర్హతను సమర్దించారు.
"కోర్టు కేవలం శిక్షను సస్పెండ్ చేస్తే సరిపోదు. నేరారోపణపై స్టే విధించాలి. స్టే ఉంటేనే అతను (రాహుల్ గాంధీ) పార్లమెంటు సభ్యునిగా కొనసాగగలడు. "అని కపిల్ సిబల్ NDTV కి చెప్పారు.