రాహుల్ జీ..! ఆయన మా దైవం, అవమానించొద్దు
రాహుల్ ని ఉద్దేశపూర్వకంగా కొంతమంది రెచ్చగొడుతున్నారని, ఆయన వారి ఉచ్చులో పడి సమయాన్ని వృధా చేసుకునే అవకాశముందన్నారు ఉద్ధవ్ థాక్రే.
ఎంపీగా అనర్హత వేటు తర్వాత రాహుల్ గాంధీ.. సావర్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పడానికి తాను సావర్కర్ ని కాదు, గాంధీని అన్నారు. బీజేపీకి చురకలంటించేందుకు ఆయన సావర్కర్ ని తెరపైకి తెచ్చారు. కానీ కాంగ్రెస్ మిత్రపక్షం ఉద్ధవ్ థాక్రే ఈ వ్యవహారంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సావర్కర్ తమ దైవం అని, ఆయన్ను కించపరిచేలా మాట్లాడొద్దని రాహుల్ కి సూచించారు. సావర్కర్ ని కించపరిస్తే విపక్ష కూటమిలో చీలికలు రావడం ఖాయమన్నారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ని తామంతా ఆరాధ్యదైవంగా భావిస్తామని, ఆయనను అవమానించడం మానుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్ధవ్ సేనతో ఉన్న మహా వికాస్ అఘాడి కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఏర్పడిందని, దాని కోసం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు ఉద్ధవ్ థాక్రే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం కలిసి పోరాడాలని, అదే సమయంలో సావర్కర్ ని అవమానిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులార్ జైల్లో సావర్కర్ చిత్రహింసను అనుభవించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు ఉద్ధవ్ థాక్రే.
మన దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మనం కలిసి వచ్చామని, ఆ విషయాన్ని రాహుల్ మరోసారి గుర్తు చేసుకోవాలన్నారు ఉద్ధవ్ థాక్రే. రాహుల్ ని ఉద్దేశపూర్వకంగా కొంతమంది రెచ్చగొడుతున్నారని, ఆయన వారి ఉచ్చులో పడి సమయాన్ని వృధా చేసుకునే అవకాశముందన్నారు. అలా సమయం వృథా చేస్తే ప్రజాస్వామ్యం ఉనికిలో ఉండదని, 2024లో వచ్చేవి ప్రతిపక్షాలకు చివరి ఎన్నికలు అవుతాయంటూ హెచ్చరించారు.