Telugu Global
National

నేడు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ.. జైలు శిక్ష తీర్పుపై అప్పీలు

రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తన లీగల్ టీమ్‌తో కలిసి సూరత్ కోర్టుకు చేరుకోనున్నారు. సూరత్ వెస్ట్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ మెజిస్టీరియల్ కోర్టులోవేసిన పరువు నష్టం దావాపై అప్పీలు చేయనున్నారు.

నేడు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ.. జైలు శిక్ష తీర్పుపై అప్పీలు
X

ఎంపీ పదవిపై అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీ తన జైలు శిక్షపై అప్పీలు చేయాలని నిర్ణయించుకున్నారు. నేడు సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో మార్చి 23న ఇచ్చిన 2 ఏళ్ల జైలు శిక్ష తీర్పుపై అప్పీలు చేయనున్నారు. రాహుల్ వెంట ఆయన లీగల్ టీమ్ కూడా వెళ్లనున్నది. అలాగే తన బెయిల్‌ను పొడిగించాలని కూడా ఆయన మరో పిటిషన్ వేయనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలో ప్రచారం చేస్తూ.. 'దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎందుకుంటుందో' అని ప్రశ్నించారు. దీనిపై పరువునష్టం దావా వేయగా.. సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీని ఆధారంగా లోక్‌సభ సెక్రటరీ రాహుల్‌ను ఎంపీ పదవి నుంచి డిస్‌క్వాలిఫై చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.

రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తన లీగల్ టీమ్‌తో కలిసి సూరత్ కోర్టుకు చేరుకోనున్నారు. సూరత్ వెస్ట్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ మెజిస్టీరియల్ కోర్టులోవేసిన పరువు నష్టం దావాపై అప్పీలు చేయనున్నారు. కాంగ్రెస్ ఎంపీ, లాయర్ అభిషేక్ మను సింగ్వీ నేతృత్వంలోని లీగల్ టీమ్ ఈ కేసు బాధ్యతలు చేపట్టింది. సీనియర్ అడ్వొకేట్ ఆర్ఎస్ చీమా రాహుల్ తరపున వాదనలు వినిపించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

రాహుల్‌కు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఆయనకు జైలు శిక్ష అమలు నుంచి 30 రోజుల వెసులు బాటు ఇచ్చింది. ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వడమే కాకుండా.. బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ నెల 22కి కోర్టు ఇచ్చిన గడువు పూర్తికానుండటంతో ఆయన అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

పై కోర్టు కూడా రాహుల్ పిటిషన్‌ను పక్కన పెడితే రాహుల్ రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంతే కాకుండా శిక్ష అనంతరం ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే వీలుండదు.

First Published:  3 April 2023 8:17 AM IST
Next Story