మణిపూర్ లో భారత్ ని హత్య చేశారు..
మణిపూర్ అల్లర్ల సమయంలో బాధితులను నేరుగా పరామర్శించిన రాహుల్ గాంధీ తనకు ఎదురైన అనుభవాలను సభలో పంచుకున్నారు. మణిపూర్ లో బాధితులు తనతో చెప్పుకున్న దీనగాధల్ని కూడా సభ ముందు ఉంచారు.
సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత లోక్ సభలో తిరిగి అడుగు పెట్టిన రాహుల్ గాంధీ.. రీఎంట్రీలో పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగినా.. ఆయన మాటలు తూటాల్లా పేలాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మోదీపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రాహుల్. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
రాహుల్ ఏమన్నారంటే..?
- మణిపూర్ లో భారత మాతను వారు హత్య చేశారు
- వారు దేశ ద్రోహులు, దేశాన్ని ప్రేమించలేరు, అందుకే మోదీ మణిపూర్ వెళ్లలేదు
- మణిపూర్ ని రెండు ముక్కలు చేశారు, అక్కడ ఏమీ మిగల్లేదు
- రావణాసురుడు.. మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలే విన్నాడు
- మోదీ కూడా.. అదానీ, అమిత్ షా చెప్పిన మాటలే వింటారు
- దేశంపై వారు కిరోసిన్ చల్లుతున్నారు
- మొన్న మణిపూర్ లో చల్లారు, ఇప్పుడు హర్యానాలో చల్లుతున్నారు
LIVE: Shri @RahulGandhi speaks on no-confidence motion against Modi govt in Lok Sabha. https://t.co/QC5JFvrqs7
— Congress (@INCIndia) August 9, 2023
మణిపూర్ అల్లర్ల సమయంలో బాధితులను నేరుగా పరామర్శించిన రాహుల్ గాంధీ తనకు ఎదురైన అనుభవాలను సభలో పంచుకున్నారు. మణిపూర్ లో బాధితులు తనతో చెప్పుకున్న దీనగాధల్ని కూడా సభ ముందు ఉంచారు. అదే సమయంలో తన భారత్ జోడో యాత్ర గురించి కూడా చెప్పారు రాహుల్ గాంధీ. జోడో యాత్ర ద్వారా తనలో ఉన్న అహంకారం మాయమైందని, నిజమైన మనిషి బయటకొచ్చాడని చెప్పుకొచ్చారు.
మొత్తమ్మీద రాహుల్ గాంధీ ప్రసంగంతో మరోసారి లోక్ సభలో కలవరం మొదలైంది. రీఎంట్రీలో రాహుల్ కాస్త తగ్గుతారేమో అనుకున్నారు బీజేపీ నేతలు. అవిశ్వాసంపై చర్చ మొదలైన తొలిరోజు రాహుల్ మాట్లాడకపోవడంతో సెటైర్లు వినిపించాయి. వారందరికీ రెండోరోజు తన ప్రసంగంతో ఘాటుగా సమాధానమిచ్చారు రాహుల్ గాంధీ.