ఇంత దిగజారిన ప్రధానిని ఎన్నడూ చూడలేదు: రాహుల్ గాంధీ
ఇంతలా దిగజారిన ప్రధానిని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రధాని మణిపూర్‌కు వెళ్లి రెండు తెగలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపొచ్చని.. కానీ అలాంటి ఉద్దేశం మోదీకి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు రాహుల్.
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీ. పార్లమెంట్‌లో 2 గంటల 13 నిమిషాలు మాట్లాడిన ప్రధాని.. మణిపూర్ సమస్యపై చివర్లో రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారని గుర్తుచేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నెలలుగా హింస జరుగుతోందన్న రాహుల్ గాంధీ.. జనాలు చనిపోతున్నారని, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ప్రధానమంత్రి మాత్రం లోక్‌సభలో నవ్వుతూ, జోకులు వేశారని విమర్శించారు. ఇది ఏ మాత్రం ప్రధాని స్థాయి వ్యక్తికి సరికాదన్నారు. అల్లర్లను ఎందుకు ఆపలేకపోతున్నామన్నది సమస్య అన్నారు. తానూ రాజకీయాల్లో 19 ఏళ్లుగా ఉన్నానని.. ఇంతలా దిగజారిన ప్రధానిని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రధాని మణిపూర్‌కు వెళ్లి రెండు తెగలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపొచ్చని.. కానీ అలాంటి ఉద్దేశం మోదీకి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు రాహుల్.
ఇక నిన్న అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో దాదాపు రెండున్నర గంటల పాటు మాట్లాడిన ప్రధాని మోదీ. ఇందులో దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్ సహా ఇతర పక్షాలను విమర్శించడానికే కేటాయించారు. దీంతో ఆగ్రహించిన విపక్షాలు మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశాయి. చివర్లో మణిపూర్‌పై మాట్లాడిన మోదీ.. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల కారణంగా చాలా కుటుంబాలు కష్టాల్లో పడ్డాయని, చాలా మంది కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయారన్నారు. మహిళలపై జరిగిన అకృత్యాలు క్షమించరానివని చెప్పారు. మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొంటుందని, ఆ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని హామీ ఇస్తున్నానన్నారు. మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. దేశాన్ని అవమానించడమేనంటూ విమర్శించారు.
మణిపూర్ అంశంపై కాంగ్రెస్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది. తీర్మానంపై లోక్‌సభలో మూడు రోజులపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చకు సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రసంగించారు. ఆ తర్వాత తీర్మానంపై మూజువాణి ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.