పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని పౌరులకు ఉపాధి లభించడం లేదన్నారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగమని చెప్పారు.
పార్లమెంటులో దుండగుల చొరబాటుకు నిరుద్యోగమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగం వల్లే ఈ సంఘటన జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈనెల 13న పార్లమెంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి టియర్ గ్యాస్ వదిలి తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్లోకి దూకి టియర్ గ్యాస్ వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేశారు.
ఈ ఘటనతో కొందరు ఎంపీలు భయపడి పార్లమెంట్ వెలుపలకు పరుగులు పెట్టగా.. మరికొందరు ఎంపీలు దుండగులను పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. పార్లమెంట్‌లో కలకలం రేగిన సమయంలోనే వెలుపల నిరసన తెలిపిన మరో ఇద్దరిని కూడా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. నిరుద్యోగమే ఈ సంఘటనకు కారణమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని పౌరులకు ఉపాధి లభించడం లేదన్నారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగమని చెప్పారు. దేశంలో నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ గాంధీ చెప్పారు.