'రాహుల్ గాంధీని చంపేస్తాం.' కలకలం సృష్టిస్తోన్న హెచ్చరిక లేఖ!
రాహుల్ గాంధీని చంపేస్తామంటూ ఓ హెచ్చరిక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారత్ జోడో యాత్ర ఇండోర్ లోకి ప్రవేశించగానే రాహుల్ ను బాంబులు పేల్చి చంపేస్తామంటూ ఆలేఖలో రాసుంది.
భారత్ జోడో యాత్ర లో ఉన్న కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీని హత్య చేస్తామంటూ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. యాత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్రవేశించగానే రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ రాసి ఉన్న ఓ లేఖ ను పోలీసులు కనుగొన్నారు. హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర ప్రవేశానికి ముందు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి హత్య బెదిరింపు వచ్చింది. రాహుల్ గాంధీ ఇండోర్‌కు రాగానే బాంబు పేలుస్తామని ఆ లేఖలో బెదిరించారు.ఇండోర్ జూని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్వీట్ షాప్ వెలుపల రాహుల్ గాంధీని చంపేస్తానని బెదిరించే లేఖ కనిపించింది. పోలీసులు ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని చూసి లేఖను స్వీట్ షాప్ వెలుపల వదిలివేసిన వ్యక్తి కోసం వెతుకుతున్నారు.
వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ వ్వాఖ్యలు చేసిన మరుసటి రోజున ఆయనకు ఈ హత్య బెదిరింపు లేఖ రావడం గమనార్హం. సావర్కర్ బ్రిటిష్ పాలకులకు సహాయం చేశాడని,భయంతో వారిని క్షమాభిక్ష కోరారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడమే గాక విమర్శలు కూడా చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ వచ్చింది.
ఇదిలా ఉండగా, తన తాతను అవమానించారంటూ సావర్కర్ మనవడు రాహుల్ గాంధీపై ముంబైలో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సావర్కర్‌పై తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని, సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తాను ఆమోదించడం లేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.