ఎంత మూల్యానికైనా సిద్ధం.. తగ్గేదే లేదన్న రాహుల్
సూటిగా సుత్తి లేకుండా రెండు లైన్లు మాత్రమే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనపై ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడినా తాను మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
అనర్హత వేటుపై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ‘భారత దేశ గళాన్ని వినిపించేందుకే తాను పోరాటం చేస్తున్నానని.. దానికోసం ఎంత మూల్యమైనా చెల్లించడానికైనా సిద్ధమే’ అని ట్వీట్ చేశారు. సూటిగా సుత్తి లేకుండా రెండు లైన్లు మాత్రమే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనపై ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడినా తాను మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా..?
రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ నేతల్లో కూడా చర్చ జరుగుతోంది. సూరత్ కోర్ట్ విధించిన శిక్ష విషయంలో రాహుల్, పై కోర్టులకు అప్పీల్ కి వెళ్లే అవకాశముంది. అక్కడ శిక్షను తగ్గించినా, రద్దు చేసినా ఆయనపై అనర్హత పడే అవకాశముండదు. ఈలోగా హడావిడిగా లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకోవడం, వయనాడ్ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు ప్రకటించడంతో అసలు గొడవ మొదలైంది. కచ్చితంగా ఇది కక్ష సాధింపేనంటూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి.
मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं।
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023
मैं हर कीमत चुकाने को तैयार हूं।
ప్రతిపక్షాల ఐక్యతకు ప్రాణం పోసిన బీజేపీ..
ఇన్నాళ్లూ ప్రతిపక్షాలకు నాయకత్వం ఎవరు వహిస్తారా అనే విషయంలో చాలా సందిగ్ధతలు ఉన్నాయి. కాంగ్రెస్ ని కలుపుకొని పోవడానికి చాలామంది మొహమాటపడుతున్నారు. కానీ రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయి. ముక్త కంఠంతో ఆ చర్యను ఖండించాయి. బీజేపీ నిరంకుశత్వంపై మండిపడ్డాయి. అంతమాత్రాన కాంగ్రెస్ నేతృత్వంలో అందరూ కలసి పోటీచేస్తారని చెప్పలేం కానీ, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న విపక్షాల మధ్య రాహుల్ వ్యవహారం ఐక్యతకు బీజం వేసింది. విడివిడిగా ఉంటే బీజేపీ అన్ని పార్టీలను తొక్కేస్తుందనే భావన అందరిలో కనిపిస్తోంది.
బీజేపీలో ఉన్నవారంతా పత్తిత్తులేనా..?
కేవలం ఒక ఇంటిపేరు ఉదాహరణగా చూపించినందుకే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసి, రెండేళ్లు జైలు శిక్ష వేసి, ఎంపీగా అనర్హత వేటు వేసి.. ఇంత చేశారు. మరి బీజేపీలో ఉంటూ మత విద్వేష వ్యాఖ్యలు చేసే సాధ్వి లాంటి వారి సంగతేంటి అని నెటిజన్లు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనివారు కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. సామాన్య జనానికి కూడా బీజేపీ చేస్తున్నది అతి అనే విషయం అర్థమవుతోంది. అనర్హత విషయానికొస్తే, మతాన్ని అడ్డు పెట్టుకుని సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ముందుగా వేటు వేయాలనే డిమాండ్లు మొదలవుతున్నాయి.