Telugu Global
National

రాయ్‌బరేలికి రాహుల్‌.. వయనాడ్‌ నుంచి ప్రియాంక

వయనాడ్‌ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రకటించారు పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే. ప్రియాంక గాంధీకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇదే తొలి ఎన్నిక కానుంది.

రాయ్‌బరేలికి రాహుల్‌.. వయనాడ్‌ నుంచి ప్రియాంక
X

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో రాహుల్‌గాంధీ వయనాడ్‌తో పాటు యూపీలోని రాయ్‌బరేలి నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే నివాసంలో సోనియా, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన రాహుల్ గాంధీ.. వయనాడ్‌ స్థానాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు.


వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలితో తనకు ఎమోషనల్ కనెక్షన్ ఉందన్నారు రాహుల్‌. గత ఐదేళ్లుగా తనకు ప్రేమను పంచిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాయ్‌బరేలికి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్న రాహుల్‌.. వయనాడ్‌ను వదులుకోవడం బాధగా ఉందన్నారు. వయనాడ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు.


వయనాడ్‌ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రకటించారు పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే. ప్రియాంక గాంధీకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇదే తొలి ఎన్నిక కానుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె పోటీకి దూరంగానే ఉన్నారు.


2019లో తన సొంత సీటు అమేథితో పాటు వయనాడ్‌ నుంచి పోటీ చేశారు రాహుల్ గాంధీ. ఐతే ఆ ఎన్నికల్లో అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్.. వయనాడ్‌లో విజయం సాధించారు. ఇటీవల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సోనియాగాంధీ పోటి రాజకీయాలకు గుడ్‌బై చెప్పడంతో రాయ్‌బరేలి స్థానం ఖాళీ అయింది. దీంతో వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలిలో కూడా పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు రాహుల్. దీంతో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వయనాడ్‌ను వదులుకున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

First Published:  17 Jun 2024 8:54 PM IST
Next Story