Telugu Global
National

పాత బంగ్లా వద్దన్న రాహుల్.. కారణం ఏంటి..?

అప్పట్లో బంగ్లానుంచి బయటకు వచ్చే సమయంలో రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ బంగ్లాతో తనకు చాలా మధురానుభూతులు ఉన్నట్టు చెప్పారు. మళ్లీ ఇప్పుడు లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో రాహుల్ కి తిరిగి అదే బంగ్లా కేటాయించింది హౌసింగ్ కమిటీ.

పాత బంగ్లా వద్దన్న రాహుల్.. కారణం ఏంటి..?
X

మోదీ ఇంటిపేరు విషయంలో పరువు నష్టం కేసు తదనంతర పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ 12-తుగ్లక్ లేన్ లోని బంగ్లా ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని తిరిగి పొందారు. ఇప్పుడాయనకు బంగ్లా కేటాయించాల్సిన బాధ్యత పార్లమెంటరీ హౌసింగ్ కమిటీపై ఉంది. దీంతో తుగ్లక్ లేన్ లోని పాత బంగ్లాను తిరిగి ఆయనకే కేటాయిస్తున్నట్టు తెలిపింది హౌసింగ్ కమిటీ. కానీ రాహుల్ గాంధీ ఆ బంగ్లా తనకు వద్దని చెప్పడం ఇక్కడ కొస మెరుపు.

రాహుల్ గాంధీ 2005 లో లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి నుంచి తుగ్లక్ లేన్ లోని బంగ్లాలోనే ఉంటున్నారు. అయితే అనుకోకుండా ఆయన సభ్యత్వం రద్దు కావడంతో ఆ బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. బంగ్లానుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ బంగ్లాతో తనకు చాలా మధురానుభూతులు ఉన్నట్టు చెప్పారు. ఆ తర్వాత సోనియా గాంధీ నివాసమైన 10-జన్ పథ్ చేరుకున్నారు. మళ్లీ ఇప్పుడు లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో రాహుల్ కి తిరిగి అధికారిక బంగ్లాను కేటాయించింది హౌసింగ్ కమిటీ. అయితే పాత బంగ్లా విషయంలో రాహుల్ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఉద్దేశపూర్వకంగానే ఆఘమేఘాలమీద తనని బంగ్లానుంచి బయటకు పంపించేశారని రాహుల్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆ బంగ్లా తనకు వద్దని చెప్పేశారు. దీంతో ఆయనకు మరో రెండు ఆప్షన్లు ఇచ్చింది హౌసింగ్ కమిటీ.

7-సఫ్దార్‌ గంజ్‌ లేన్‌, 3-సౌత్‌ అవెన్యూ బంగ్లాలలో ఒకదాన్ని ఎంచుకోవాలని పార్లమెంట్ కమిటీ రాహుల్ కి సూచించింది. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ వ్యక్తిగత భద్రతా బృందం ఆ రెండు బంగ్లాలను పరిశీలిస్తోంది. ఆ రెండిటిలో ఒకదాన్ని రాహుల్ ఎంపిక చేసుకుంటారని, త్వరలో 10-జన్ పథ్ నుంచి ఆయన తన మకాం మారుస్తారని తెలుస్తోంది.

First Published:  24 Aug 2023 10:24 AM GMT
Next Story