Telugu Global
National

మరణం ఎవరికీ తప్పదు.. నేనెందుకు భయడాలి -రాహుల్

1947 తర్వాత భారత చరిత్రలో పరువు నష్టం కేసులో అతి పెద్ద శిక్ష పడిన మొదటి వ్యక్తి తానేనన్నారు రాహుల్ గాంధీ.

మరణం ఎవరికీ తప్పదు.. నేనెందుకు భయడాలి -రాహుల్
X

చంపేస్తామనే బెదిరింపులకు తానెప్పుడూ భయపడలేదని అన్నారు రాహుల్ గాంధీ. ప్రాణహాని గురించి ఆందోళన చెందలేదన్నారు. మరణం ఎవరికీ తప్పదని, అలాంటప్పుడు తానెందుకు భయపడాలని.. నాన్న, నాన్నమ్మ నుంచి ఆ విషయం తాను నేర్చుకున్నానని చెప్పారు. వాషింగ్టన్ లోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన రాహుల్, భారత్ లో బీజేపీ రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు.


అత్యంత భారీ శిక్ష నాకే..

1947 తర్వాత భారత చరిత్రలో పరువు నష్టం కేసులో అతి పెద్ద శిక్ష పడిన మొదటి వ్యక్తి తానేనన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్‌ లో అదానీపై ప్రసంగించిన వెంటనే తనపై అనర్హత వేటు పడిందని, దీన్నిబట్టి భారత్ లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. భారత్ జోడో యాత్రలో తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచానని, లక్షలాదిమంది భారతీయులతో మాట్లాడానని.. దేశంలోని సంస్థలు పత్రికారంగంపై తనకు కచ్చితమైన పట్టు ఉందన్నారు. దేశంలో ప్రజలెవరూ సంతోషంగా ఉన్నట్టు తనకు అనిపించలేదన్నారు రాహుల్. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి తీవ్రమైన సమస్యలు భారత్ లో ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య సమాజానికి పత్రికా స్వేచ్ఛ కీలకం అని చెప్పారు.


విభజించు పాలించు..

సమాజంలో బీజేపీ విద్వేషాలను రగిలిస్తోందని, అందరినీ వారు దగ్గరకు తీసుకోవట్లేదని, సమాజాన్ని విభజిస్తున్నారని ఇలాంటి రాజకీయాలు భారత్ ను దెబ్బతీస్తున్నాయని చెప్పారు రాహుల్. భారతీయులందరికీ భావ వ్యక్తీకరణ హక్కు, మత స్వేచ్ఛ హక్కు ఉందన్నారు. భారతదేశంలో ఇప్పటికీ చాలా పటిష్టమైన వ్యవస్థ ఉందని, అయితే బీజేపీ పాలనలో అది బలహీనపడిందన్నారు. చైనా, భారత్ కు చెందిన 1500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని, అయితే ఈ వాస్తవాన్ని బీజేపీ నేతలు అంగీకరించడంలేదన్నారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని చెప్పారు రాహుల్ గాంధీ.

First Published:  2 Jun 2023 11:00 AM IST
Next Story