రాయ్‌బరేలీ నుంచీ రాహుల్ పోటీ.. వయనాడ్‌లో ఓటమి భయమా?
80 ఎంపీ సీట్లున్న యూపీలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో ఆ పార్టీకే అధికారం దక్కుతుంది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు 17 స్థానాలు ఇచ్చారు.
అనుకున్నట్లే జరిగింది. తన తల్లి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీకి దిగారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ జరిగిన కేరళలోని వయనాడ్ స్థానం నుంచి రాహుల్ పోటీ చేశారు. అక్కడ ఎన్నిక ముగిసిపోవడంతో రాయ్‌బరేలీలోనూ పోటీకి సిద్ధమయ్యారు. వయనాడ్‌లో ఓటమి భయంతోనే రాహుల్ రాయ్‌బరేలీలోనూ పోటీకి దిగారని బీజేపీ విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది.
గాంధీ కుటుంబానికి కంచుకోట
1952 నుంచి రాయ్‌బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి కంచుకోట. తొలుత ఇక్కడి నుంచి ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఇందిరా 1967 నుంచి 1980 వరకు ఇక్కడి నుంచి పోటీచేశారు. 1977లో మినహా అన్నిసార్లూ ఆమెదే గెలుపు. ఇక సోనియా గాంధీ 2004 నుంచి వరుసగా ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా వయసు, ఆరోగ్య కారణాల రీత్యా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విరమించుకుని, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో తన తల్లి ఖాళీ చేసిన స్థానంలో ఇప్పుడు రాహుల్ బరిలో నిలిచారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కేవలం మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ ఓడిపోయింది.
ప్రియాంక పోటీ చేస్తుందన్నారు..
రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీవాద్రా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. దానికి తోడు ప్రియాంక కూడా కాదనకపోవడంతో అమేథీ, రాయ్‌బరేలీల్లో రాహుల్, ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీయే బరిలోకి దిగబోతున్నారు.
వయనాడ్‌లో ఓడిపోతానని భయమా?
గత ఎన్నికల్లో తమ కంచుకోట అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేశారు. అమేథీలో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినా వయనాడ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. అయితే ఈసారి అక్కడి నుంచి సీపీఐ అగ్రనేత రాజా భార్య అనీ రాజా బరిలో నిలిచారు. ఇండియా కూటమి పొత్తులో సీపీఐ కూడా ఉన్నందున పొత్తు ధర్మం ప్రకారం వయనాడ్ వదిలేయాలని వారు కోరినా రాహుల్ పట్టించుకోలేదు. ముస్లింలు ఎక్కువగా ఉండే వయనాడ్ అయితే తనకు సురక్షిత స్థానమని రాహుల్ అక్కడి నుంచి పోటీ చేశారు. అయితే అనీరాజా అక్కడ గెలిచే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యూపీలో ఊపు తేవడానికా?
80 ఎంపీ సీట్లున్న యూపీలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో ఆ పార్టీకే అధికారం దక్కుతుంది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు 17 స్థానాలు ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్‌కు ఊపు తేవడానికే రాహుల్ పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది. కానీ వయనాడ్‌లో ఓడిపోతే దేశ రాజకీయాల్లో రాహుల్‌కు ప్రత్యక్ష పాత్ర లేకుండా పోతోందనే భయంతోనే ఆయన రాయ్‌బరేలీలో పోటీ పడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది.