Telugu Global
National

పార్లమెంట్ లో ఉన్నా లేకున్నా ప్రజలకోసం కోసం పనిచేస్తా..

తనపై పూర్తిగా అనర్హత వేటు వేసినా పట్టించుకోనని, పార్లమెంట్ లో ఉన్నా లేకున్నా ప్రజలు, దేశం కోసం పనిచేస్తానని చెప్పారు. తనకు మద్దతు ఇచ్చిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ.

పార్లమెంట్ లో ఉన్నా లేకున్నా ప్రజలకోసం కోసం పనిచేస్తా..
X

డిస్ క్వాలిఫై చేసినా, జైలులో పెట్టినా భయపడేది లేదన్నారు రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ షెల్ కంపెనీల్లో కొన్ని డిఫెన్స్ సంస్థలు ఉన్నాయని, డిఫెన్స్ అథారిటీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అదానీని ప్రధాని ఎందుకు కాపాడుతున్నారన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదానీ, మోదీ ఒకే విమానంలో ప్రయాణించేవారని, అదానీ కోసం ఎయిర్ పోర్టు రూల్స్ నే మార్చారని ఆరోపించారు రాహుల్ గాంధీ.


కేంద్రమంత్రులు పార్లమెంట్ లో అబద్దాలు చెప్పారని, విదేశీ శక్తుల నుంచి తాను సహాయం కోరానని ఆరోపించారని.. కానీ తాను అలాంటివేవీ చేయలేదన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా ప్రశ్నించడం మాత్రం ఆపబోనన్నారు రాహుల్ గాంధీ. అనర్హత వేటు గురించి స్పీకర్ ని కలసి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలన్నా కుదరలేదని, రెండు పేజీల లేఖ రాస్తే జవాబు ఇవ్వలేదని చెప్పారు.

అందుకే నాపై వేటు..

పార్లమెంట్ లో అదానీపై తన ప్రసంగానికి భయపడే మోదీ అనర్హత వేటు వేయించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ కళ్లలో భయాన్ని చూశానన్నారు. తాను ఏ ప్రశ్న అడిగినా ఆలోచించే అడుగుతానని చెప్పారు. అదానీతో తమ పార్టీ ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తెలిస్తే జైలులో వేయండని తాను చెప్పానన్నారు.

దేశం కోసం ఏదైనా చేస్తా..

తాను జైలు శిక్ష గురించి భయపడట్లేదని, ప్రజల్లోకి వెళ్లడమే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం అని అన్నారు రాహుల్ గాంధీ. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పారు. వయనాడ్ ప్రజల మనసులో ఏం ఉందో లేఖ రాస్తానని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖతం అయిందని అన్నారు.

భారత్ జోడో యాత్రతో తాను ప్రజల్లోకి వెళ్లానని, తాను ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటానని చెప్పారు రాహుల్ గాంధీ. దేశంలోని పేద ప్రజల గొంతును వినిపిస్తూనే ఉంటానన్నారు. తనపై పూర్తిగా అనర్హత వేటు వేసినా పట్టించుకోనని, పార్లమెంట్ లో ఉన్నా లేకున్నా ప్రజలు, దేశం కోసం పనిచేస్తానని చెప్పారు. తనకు మద్దతు ఇచ్చిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ.

First Published:  25 March 2023 2:22 PM IST
Next Story