నాకు సొంత ఇల్లు లేదు, కారు లేదు..
స్థిరాస్తుల విషయానికి వస్తే ఢిల్లీలోని మెహ్రౌలీలో తనకు వ్యవసాయ భూమి ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దాంట్లో తన సోదరి ప్రియాంక గాంధీకి కూడా వాటా ఉందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆస్తులపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన బుధవారం నామినేషన్ దాఖలు వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ సందర్భంగా రాహుల్‌గాంధీ అధికారులకు తన తాజా ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్‌కు రూ.20 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. రూ.55 వేల నగదు, రూ.4.20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి.
స్థిరాస్తుల విషయానికి వస్తే ఢిల్లీలోని మెహ్రౌలీలో తనకు వ్యవసాయ భూమి ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దాంట్లో తన సోదరి ప్రియాంక గాంధీకి కూడా వాటా ఉందన్నారు. ఇది తమకు వారసత్వంగా దక్కిన ఆస్తిగా పేర్కొన్నారు. అలాగే గురుగ్రామ్‌లో ఒక ఆఫీస్ ఉందని.. దాని విలువ రూ.9 కోట్లని రాహుల్ తెలిపారు. తనకు రూ.49.7లక్షల అప్పులు కూడా ఉన్నాయని ప్రకటించారు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. రాహుల్ తనకు సొంత వాహనం గానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనపై బీజేపీ నేతలు పరువు నష్టం కేసులు పెట్టారని.. అలాగే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కి సంబంధించిన క్రిమినల్ కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ.