Telugu Global
National

'రిమోట్ కంట్రోల్' వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపాటు

కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో కొత్త అధ్యక్షుడు తన అధికారాలను పూర్తిగా వినియోగించుకుంటాడని.. ఇతర పార్టీలు ఆరోపించినట్లుగా వాళ్లు ఏమీ రిమోట్ కంట్రోల్ జాబ్ చేయరని రాహుల్ గాంధీ వెల్లడించారు.

రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపాటు
X

కాంగ్రెస్ పార్టీకి ఎవరు జాతీయ అధ్యక్షుడు అయినా వాళ్లు గాంధీ కుటుంబానికి 'రిమోట్ కంట్రోల్' లాగా పని చేయాల్సిందేనని బీజేపీ వ్యాఖ్యానించింది. కాగా, తమ అంతర్గత ఎన్నికల విషయంలో బీజేపీ అనవసరమైన వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నిక అభ్యర్థి మల్లిఖార్జున్ ఖర్గే బీజేపీ వ్యాఖ్యలను ఖండించారు. తాను రిమోట్ కంట్రోల్‌లాగా పని చేయబోనని, తనకుంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా బీజేపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

'భారత్ జోడో యాత్ర' కర్ణాటకలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎవరు అధ్యక్షుడు అయినా వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో కొత్త అధ్యక్షుడు తన అధికారాలను పూర్తిగా వినియోగించుకుంటాడని.. ఇతర పార్టీలు ఆరోపించినట్లుగా వాళ్లు ఏమీ రిమోట్ కంట్రోల్ జాబ్ చేయరని వెల్లడించారు. ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఇద్దరు ఉన్నారు. వాళ్లు ఎందుకు ఆ పదవికి పోటీ చేస్తున్నారనే విషయంపై వాళ్లకు స్పష్టత ఉన్నది. అలాగే వాళ్లకు ఈ పార్టీని నడిపించడానికి తమదైన వ్యూహాలు ఉన్నాయి. అంతే కాని వాళ్లు ఎవరో రిమోట్ కంట్రోల్‌లో పని చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

మాది ఫాసిస్టు పార్టీ కాదు. మా పార్టీలో పూర్తి ప్రజాస్వామ్యం అమలు అవుతుంది. ఇక్కడ ఎన్నో రకాల చర్చలు జరుగుతుంటాయి. ప్రతీ ఒక్కరి ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాము. ఒక ఎన్నిక గెలవాలంటే కచ్చితంగా ఒక టీమ్ వర్క్ చేయాలనే విషయం పార్టీలో అందరికీ తెలుసని రాహుల్ గాంధీ చెప్పారు. మన రాజ్యాంగం ప్రకారం..ఇండియా అనేది రాష్ట్రాల సమాఖ్య. అంటే ఇక్కడ అన్ని భాషలు, రాష్ట్రాలు, సంస్కృతులకు సమానమైన ప్రధాన్యత ఉండాలి. అదే మన దేశంలో గతంలో కొనసాగిన పద్దతి. కానీ ఇప్పుడు మాత్రం విద్వేషాలు, హింసను ప్రోత్సహించే వాళ్లు తయారయ్యారు. ఎవరైనా దానికి వ్యతిరేకిస్తే యాంటీ-నేషనల్ అనే ముద్ర వేస్తున్నారు. మేము కచ్చితంగా విద్వేషాలు, హింసను ప్రేరేపించేవారికి వ్యతిరేకంగా పోరాడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.



First Published:  8 Oct 2022 2:33 PM IST
Next Story