Telugu Global
National

టీషర్ట్ ల హవానే నడుస్తోంది అందుకే నేను కూడా... రిపోర్టర్ ప్రశ్నకు రాహుల్ గాంధీ జవాబు

ఈ రోజు కాంగ్రెస్ వ్యవస్థాపక‌ దినోత్సవం సందర్భంగా రాహుల్ గా‍ంధీ మళ్ళీ అదే టీ షర్ట్ ధరించి కనిపించారు. ఈ సందర్భంగా “ఈ రోజు మళ్లీ అదే టీ షర్ట్ లో...?” అని ఒక విలేఖరి అతనిని అడిగినప్పుడు, రాహుల్, “టీ-షర్ట్ హీ చల్ రహీ హై ఔర్ జబ్ తక్ చల్ రహీ హై చలాయేంగే”అని జవాబు చెప్పారు.

టీషర్ట్ ల హవానే నడుస్తోంది అందుకే నేను కూడా... రిపోర్టర్ ప్రశ్నకు రాహుల్ గాంధీ జవాబు
X

'గత చాలా రోజులుగా భారత్ జోడో యాత్రలో రాహుల్ అదే తెల్లటి టీ-షర్టును ఎందుకు ధరిస్తున్నాడు.' అనే ప్రశ్న గత వారం రోజులుగా సోషల్ మీడియాలో, వార్తలలో రౌండ్లు కొడుతోంది. ఈ రోజు రాహుల్ గాంధీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఈ రోజు కాంగ్రెస్ వ్యవస్థాపక‌ దినోత్సవం సందర్భంగా రాహుల్ గా‍ంధీ మళ్ళీ అదే టీ షర్ట్ ధరించి కనిపించారు. ఈ సందర్భంగా "ఈ రోజు మళ్లీ అదే టీ షర్ట్ లో...?" అని ఒక విలేఖరి అతనిని అడిగినప్పుడు, రాహుల్, "టీ-షర్ట్ హీ చల్ రహీ హై ఔర్ జబ్ తక్ చల్ రహీ హై చలాయేంగే" (ఇప్పుడు టీ-షర్ట్ లదే నడుస్తోంది. ఆ హవా ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నేను అదే ధరిస్తాను ) అని జవాబు చెప్పారు.

ఉత్తర భారతదేశాన్ని విపరీతమైన చలి వణికిస్తూ ఉంటే , రాహుల్ సాధారణ టీ షర్ట్ తో బహిరంగ కార్యక్రమాలకు రావడం చర్చనీయాంశమైంది. విపరీతమైన చలిలో నల్లటి టీ షర్టు ధరించిన రాహుల్ తన మేనకోడలుతో కలిసి ఢిల్లీ మాల్‌లో ఉన్నట్లు మంగళవారం ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంత చలిలో కనీసం మూడు గంటల పాటు భారత్ జోడో యాత్ర లాంటి బహిరంగ ర్యాలీలో నడవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాలు విసిరింది.

యాత్ర ప్రారంభంలో "రూ. 41,000 విలువైన బుర్బెర్రీ టీ-షర్టు" ధరించినందుకు రాహుల్ గాంధీ పై బిజెపి దాడి చేసింది. ఆ టీషర్ట్ పైనా బీజేపీ కొంత కాలం చర్చలు చేసింది.ఇప్పుడు మళ్ళీ టీ షర్ట్ చర్చ మొదలైంది. హర్యానాలో మాజీ బీజేపీ నాయకుడు సుధీంద్ర కులకర్ణి భారత్ జోడో యాత్రలో రాహుల్ తో పాటు నడిచాడు. ఈ సందర్భంగా ఆయన డిసెంబర్ 21న ట్వీట్ చేస్తూ, "ఈ మధ్యాహ్నం హర్యానాలో నేను భారత్ జోడో యాత్రలో ఓ తపస్వితో కలిసి 7.5 కిలోమీటర్లు నడిచాను." అని కామెంట్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాహుల్ గాంధీ టీషర్ట్ పై స్పంధిస్తూ, ''రాహుల్ గాంధీ మానవాతీతుడు.మేము జాకెట్లు వేసుకుని కూడా చలిలో గడ్డకట్టుకుపోతుంటే, ఆయన‌ టీ షర్టులు వేసుకుని యాత్ర సాగిస్తున్నాడు. ఆయన‌ తన 'తపస్సు'ను ఏకాగ్రతతో చేసే యోగి లాంటివాడు." అని కామెంట్ చేశారు.


First Published:  28 Dec 2022 12:33 PM IST
Next Story