Telugu Global
National

కోటీశ్వరుల భారత్ - నిరుపేదల భారత్

మన దేశంలో రెండు భాగాలున్నాయని ఒకటి కోటీశ్వరుల భారత్, రెండోది నిరుపేదల భారత్ అని వివరించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్, అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

కోటీశ్వరుల భారత్ - నిరుపేదల భారత్
X

బీజేపీ పాలనలో భారత దేశం రెండు రకాలుగా విడిపోయిందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. బీజేపీ పథకాలు పేదల్ని మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్నాయని, కొంతమంది కోటీశ్వరులను వేలకోట్ల సామ్రాజ్యాలకు అధినేతలుగా మార్చేస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం మన దేశంలో రెండు భాగాలున్నాయని ఒకటి కోటీశ్వరుల భారత్, రెండోది నిరుపేదల భారత్ అని వివరించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్, అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

భారత్ జోడో యాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన రాహుల్ గాంధీ తొలిసారిగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహువా, రాజ్ కోట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో హుషారెత్తించే ప్రసంగాలు చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, గిరిజన హక్కులు.. వంటి అంశాలపై సునిశితంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. వాస్తవ పరిస్థితుల్ని ప్రజల కళ్లకు కట్టారు. గిరిజనుల అటవీ భూముల్ని లాక్కొని, కొంతమంది ధనవంతులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.

వివక్ష ఎందుకు..?

లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు వందల కిలోమీటర్లు రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి, లాఠీలు ఝళిపించారని, వేలాదిమంది ఆకలి చావులకు కారణం అయ్యారని బీజేపీ నేతలపై మండిపడ్డారు రాహుల్ గాంధీ. అదే సమయంలో ధనికులైన పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల బకాయిలను రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. పేదలకు సాయం అందించకపోగా, పెద్దలకు భారీగా ఆర్థిక ప్రతిఫలాలు అందించి అంతరాన్ని మరింత పెంచారని విమర్శించారు.

ఇటీవల గుజరాత్ లో జరిగిన తీగల వంతెన దుర్ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు రాహుల్ గాంధీ. 135మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, దీనికి కారణమైనవారిపై ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గుజరాత్ లో బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని, ఈసారి కాంగ్రెస్ కి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని చెప్పారు.

First Published:  22 Nov 2022 7:58 AM IST
Next Story