Telugu Global
National

డిస్'క్వాలిఫైడ్' ఎంపీ.. రాహుల్ సెన్సాఫ్ హ్యూమర్ అదుర్స్

పార్లమెంట్ లో అదానీ కుంభకోణం గురించి రాహుల్ పదే పదే ప్రశ్నలు వేయడంతో ఆయనపై చర్యలకు కోర్టు తీర్పుని ఒక సాకుగా తీసుకున్నారనే వాదన వినపడుతోంది. దీంతో రాహుల్ తనను తాను డిస్'క్వాలిఫైడ్' ఎంపీగా సంబోధించుకున్నారు.

డిస్క్వాలిఫైడ్ ఎంపీ.. రాహుల్ సెన్సాఫ్ హ్యూమర్ అదుర్స్
X

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనర్హత వేటుకి కారణమైన కేసు, దానిపై వచ్చిన తీర్పు కూడా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇక ఈ విషయంలో ప్రతిపక్షాల ఐక్యత కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారుకి మింగుడుపడటంలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన పోరాటాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకున్నారు. తాజాగా రాహుల్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో బయోడేటా ఇన్ఫోను మార్చారు. ఈ మార్పు ఆసక్తికరంగా ఉంది.

అఫిషియల్ అకౌంట్ ఆఫ్ రాహుల్ గాంధీ, మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని గతంలో రాహుల్ ట్విట్టర్ బయో ఉండేది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే చోట ఇప్పుడు Dis'Qualified MP అని మెన్షన్ చేశారు రాహుల్. తనపై వేసిన అనర్హత వేటుని ఆయన ఇలా సెటైరిక్ గా మార్చేశారు.

రాహుల్ పై అనర్హత వేటు కేవలం రాజకీయ ప్రతీకార చర్యేనంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ లో అదానీ కుంభకోణం గురించి రాహుల్ పదే పదే ప్రశ్నలు వేయడంతో ఆయనపై చర్యలకు కోర్టు తీర్పుని ఒక సాకుగా తీసుకున్నారనే వాదన వినపడుతోంది. దీంతో రాహుల్ తనను తాను డిస్'క్వాలిఫైడ్' ఎంపీగా సంబోధించుకున్నారు. అందులోనే తన క్వాలిఫికేషన్ ను ఆయన ప్రస్తావించారు.


మోదీ ఇంటిపేరు కాదా..?

పరువు నష్టం కేసుతో రాహుల్‌ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడేందుకు కారణమై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. విచిత్రం ఏంటంటే.. పూర్ణేష్ ఇంటిపేరు మోదీ కాదు. ఆయన అసలైన ఇంటిపేరు భూత్‌ వాలా! అయితే కులం పేరుని ఇంటిపేరుతో కలుపుకొని భూత్ వాలాను మోదీగా మార్చుకున్నారు పూర్ణేష్. ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ తరపు లాయర్ ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకురాగా అసలు విషయం బయటపడింది. అంటే పక్కా ప్లాన్ తోనే రాహుల్ పై కేసు వేశారని, శిక్ష ఖరారు కాగానే, ఆఘ మేఘాలమీద ఆయనపై అనర్హత వేటు వేసి, వయనాడ్ సీటుని ఖాళీగా చూపించారని తేటతెల్లమైంది.

First Published:  26 March 2023 9:48 PM IST
Next Story