సుప్రీంలో రాహుల్ కేసు విచారణ.. 'స్టే'కు నిరాకరణ, వారికి నోటీసులు
స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో పూర్ణేష్ మోదీకి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్ట్ 4కు వాయిదా వేసింది.
'మోదీ ఇంటిపేరు - పరువు నష్టం' కేసులో రాహుల్ గాంధీ అనర్హత, జైలుశిక్ష వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సూరత్ కోర్టు శిక్ష విధించడం, గుజరాత్ హైకోర్టులో కూడా తీర్పు వ్యతిరేకంగా రావడంతో.. చివరకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు రాహుల్ గాంధీ. ఈరోజు కేసు విచారణ జరిగింది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రాహుల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. 111 రోజుల నుంచి పిటిషనర్ వేదనకు గురవుతున్నారని, ఇప్పటికే ఒక పార్లమెంట్ సెషన్ కోల్పోయారని, ఇప్పుడు మరో సెషన్ ను కూడా మిస్ అవుతున్నారని న్యాయవాది తెలిపారు. వయనాడ్ నియోజకవర్గానికి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారని, రాహుల్ పై అనర్హత వేటును రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. అయితే స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో పూర్ణేష్ మోదీకి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్ట్ 4కు వాయిదా వేసింది.
ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న పూర్ణేష్ మోదీ, గుజరాత్ ప్రభుత్వ వాదనలు వినాల్సి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు 100 పేజీలు ఉందని, దాన్ని స్టడీ చేసేందుకు సమయం పడుతుందని చెప్పారు న్యాయమూర్తులు. అందుకే ఈ దశలో స్టే ఇవ్వలేమన్నారు.
న్యాయమూర్తి మారలేదు..
జస్టిస్ బీఆర్ గవాయి, ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో విచారణ జరుపుతోంది. తన తండ్రి, సోదరుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున ఈ పిటిషన్ విచారణ బెంచ్ నుంచి తప్పుకోవాలని భావించారు జస్టిస్ గవాయి. అయితే ఆయన విచారణ చేపట్టేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రతివాదుల తరపు న్యాయవాది తెలిపారు. ఆ తర్వాతే బెంచ్ నోటీసులు జారీ చేయడం విశేషం.