వాళ్లు నన్ను చంపేసేవారేమో..? – రాహుల్ గాంధీ
అసలు కారణాన్ని ఆయన ఇప్పుడు బయటపెట్టారు. ఆ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని, అక్కడ పాదయాత్ర చేయొద్దని భద్రతా సిబ్బంది తనకు చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు రాహుల్ గాంధీ.
లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ‘21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్’ అనే అంశంపై ప్రసంగిస్తూ జోడో యాత్రలో తనకు ఎదురైన ఓ భయానక అనుభవాన్ని పంచుకున్నారు రాహుల్ గాంధీ. ఆరోజు ఉగ్రవాదులు తనను చంపేసి ఉండేవారని చెప్పుకొచ్చారు. అయితే తాను ఇచ్చిన సమాధానంతో వారు సంతృప్తి చెందారని, అందుకే తనను చంపలేదని అన్నారు.
2022 సెప్టెంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టారు. 12 రాష్ట్రాల మీదుగా పాదయాత్ర చేసి చివరిగా జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించారు. అయితే అక్కడ ఆయనకు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యాయి. భద్రతా సిబ్బంది లేకపోవడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దానికి అసలు కారణాన్ని ఆయన ఇప్పుడు బయటపెట్టారు. ఆ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని, అక్కడ పాదయాత్ర చేయొద్దని భద్రతా సిబ్బంది తనకు చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు రాహుల్ గాంధీ.
యాత్రలో ఓరోజు గుర్తుతెలియని వ్యక్తి తన దగ్గరకు వచ్చి కాంగ్రెస్ నేతలు నిజంగానే జమ్మూకాశ్మీర్ కు వచ్చి ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అని అడిగాడన్నారు. తన సమాధానం విన్న తర్వాత దూరంగా ఉన్న కొంతమందిని చూపిస్తూ ‘వాళ్లంతా ఉగ్రవాదులు’ అని చెప్పి వెళ్లిపోయాడని రాహుల్ వివరించారు. ఆ సమయంలో తాను నిజంగానే సమస్యల్లో ఉన్నానేమోనని అన్పించిందన్నారు. ఆ పరిస్థితుల్లో ఉగ్రవాదులు తనను చంపేసేవారేనని, కానీ వారు అలా చేయలేదన్నారు. తన సమాధానం వారికి నచ్చి ఉంటుందన్నారు. లిజనింగ్ కు ఉన్న శక్తి అది అని అన్నారు రాహుల్ గాంధీ. ప్రజా సమస్యలు వినడానికి వచ్చానన్న కారణంతోనే వాళ్లు తనపై దాడి చేయలేదని రాహుల్ చెప్పారు. అలా జమ్మూ కాశ్మీర్ లో ఎదురైన భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్ గాంధీ.