ద్రావిడ్‌కు బెంగళూరు యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్.. తోసిపుచ్చిన రాహుల్
ఏదో ఒక రోజు డాక్టరేట్ పట్టాకోసం స్పోర్ట్స్ సబ్జెక్టు మీద అకాడమిక్ రీసెర్చ్ చేసి, పరిశోధన వ్యాసాలతో గౌరవ డాక్టరేట్ సంపాదించుకుంటానని, ఇలా ఉచితంగా ఇచ్చే పట్టా వద్దు అంటూ సున్నితంగా తిరస్కరించారు.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత క్రికెట్ టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు బెంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టా ఆఫర్ చేసింది. అయితే ఈ ఆఫర్‌ను ద్రావిడ్ గౌరవంగా తోసిపుచ్చాడు. తాను ఆటల మీద ఎప్పటికైనా పరిశోధించి, రీసెర్చ్ ఆర్టికల్స్‌తో (Doctorate Research) పట్టా తీసుకోవాలనుకుంటున్నానని, ఇలా గౌరవంతో ఇచ్చే డాక్టరేట్ పట్టా వద్దు అంటూ యూనివర్శిటీ అధికారులకు తన సమాధానాన్ని తెలియజేశారు. తన భార్య విజేత కూడా డాక్టరేట్ పొందారని, అందుకోసం ఆమె నిద్రాహారాలు మానుకుని అహర్నిశలు శ్రమించి ఆ డిగ్రీ సంపాదించుకుందని రాహుల్ తెలిపారు.
తన తల్లి ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారని, దాదాపు 50 సంవత్సరాలు వయసులో ఆమె కూడా పీహెచ్‌డీ కోసం ఎంతో శ్రమించిందని కూడా తెలిపాడు. తానుకూడా క్రికెట్‌లో శ్రమిస్తూ రాణించానని, కానీ తన భార్య, తల్లి మాదిరి చదువుల కోసం శ్రమించలేదని చెప్పుకొచ్చాడు. అందుకే తానూ ఏదో ఒక రోజు డాక్టరేట్ పట్టాకోసం స్పోర్ట్స్ సబ్జెక్టు మీద అకాడమిక్ రీసెర్చ్ చేసి, పరిశోధన వ్యాసాలతో గౌరవ డాక్టరేట్ సంపాదించుకుంటానని, ఇలా ఉచితంగా ఇచ్చే పట్టా వద్దు అంటూ సున్నితంగా తిరస్కరించారు. తనకు గౌరవ డాక్టరేట్ ఆఫర్ చేసిన బెంగళూరు యూనివర్శిటీ పాలకమండలికి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ నిరాడంబరత గురించి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.