Telugu Global
National

బాల్ థాక్రే సమాధి గోమూత్రంతో శుద్ధి.. ఎందుకంటే..?

వెంటనే రెండు బిందెల గోమూత్రం తెప్పించి సమాధిని శుభ్రంగా కడిగారు. ఆ ప్రాంగణమంతా గోమూత్రం చల్లారు. ఇక శుద్ధి జరిగిందని ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు.

బాల్ థాక్రే సమాధి గోమూత్రంతో శుద్ధి.. ఎందుకంటే..?
X

మొట్టమొదటి సారిగా బాల్ థాక్రే సమాధిని గోమూత్రంతో శుద్ధి చేశారు. గతంలో ఎప్పుడూ ఎవరూ ఇలా చేయలేదు. అసలేంటి కథ. ఎందుకిలా చేయాల్సి వచ్చింది. అంత అపవిత్రమైన పని అక్కడ ఎవరు చేశారు, ఏం చేశారు..? దీనికి సమాధానం తెలియాలంటే ఇది చదవాల్సిందే.

ఏక్ నాథ్ షిండే బీజేపీతో చేతులు కలపడంతో శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. బాల్ థాక్రే వారసుడిని నేను, నాదే అసలైన శివసేన అంటున్నారు మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే. బాల్ థాక్రే ఆశయాలకు వారసుడిని నేను, నాదే అసలైన శివసేన అంటారు ప్రస్తుత సీఎం షిండే. ఇద్దరి మధ్య పార్టీ పేరు కోసం గుర్తుకోసం పెద్ద ఫైటింగే జరుగుతోంది. ఈ దశలో బాల్ థాక్రే వర్థంతి సందర్భంగా ఇరు వర్గాలు ఆయన సమాధి దగ్గర తమ బలాబలాలు నిరూపించుకోవాలనుకున్నాయి. ముందుగా ఉద్ధవ్ సేన బాల్ థాక్రే సమాధి వద్ద నివాళులర్పించింది. ఆ తర్వాత షిండే ఎంట్రీ ఇచ్చారు. సీఎం కదా, అధికారిక లాంఛనాలతో ఆయన థాక్రే సమాధి వద్దకు చేరుకున్నారు. ఆయన కూడా సమాధిని దర్శించి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన వారసత్వం నిలబెడతామంటూ నినదించారు.

అక్కడితో ఎవరికీ ఏ పేచీ లేదు. కానీ షిండే వెళ్లిన తర్వాత ఉద్ధవ్ వర్గం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. బాల్ థాక్రే స్థాపించిన శివసేనను చీల్చిన వ్యక్తికి ఆయన సమాధిని తాకే అర్హత లేదని పేర్కొన్నారు ఉద్ధవ్ వర్గం నేతలు. ఆయన మొసలి కన్నీరు కార్చిన చోటు అపవిత్రం అయిందని మండిపడ్డారు. వెంటనే రెండు బిందెల గోమూత్రం తెప్పించి సమాధిని శుభ్రంగా కడిగారు. ఆ ప్రాంగణమంతా గోమూత్రం చల్లారు. ఇక శుద్ధి జరిగిందని ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. ఈ గోమూత్రం శుద్ధి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోమూత్రం వ్యవహారంపై షిండే వర్గం రగిలిపోతోంది. బాల్ థాక్రే ఏ ఒక్కరికో చెందిన వ్యక్తి కాదని, తామే ఆయనకు అసలైన వారసులం అని చెబుతున్నారు షిండే వర్గం నేతలు. శివసేనను నిట్టనిలువునా చీల్చిన వ్యక్తికి ఆయన సమాధిని తాకే అర్హత లేదంటున్నారు ఉద్ధవ్ వర్గం నేతలు.

First Published:  17 Nov 2022 6:28 PM IST
Next Story