Telugu Global
National

మూసేవాలా హంతకుల్ని ఎన్‌కౌంటర్ చేసిన పంజాబ్ పోలీసులు..

మే 29న కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా(28) దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి జీప్ లో వెళ్తుండగా దారికాచిన దుండగులు సిద్ధూపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

మూసేవాలా హంతకుల్ని ఎన్‌కౌంటర్ చేసిన పంజాబ్ పోలీసులు..
X

ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు గ్యాంగ్ స్టర్లు పంజాబ్ పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించారు. అమృత్‌ సర్‌ సమీపంలోని భక్నా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్యాంగ్‌ స్టర్లు, పోలీసుల మధ్య ఉదయం నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి. పంజాబ్‌ పోలీసు విభాగానికి చెందిన యాంటీ గ్యాంగ్‌ స్టర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈ ఆపరేషన్‌ చేపట్టింది. మూసేవాలా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు గ్యాంగ్‌ స్టర్లు జగ్‌ రూప్‌ సింగ్‌ రూపా, మన్‌ ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ మన్నూ కూసాలను పట్టుకొనేందుకు ఆ ప్రాంతాన్ని ఉదయమే చుట్టుముట్టారు పోలీసులు. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేసి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. గ్యాంగ్ స్టర్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా వారిని అమృత్‌ సర్‌ లోని ఆస్పత్రికి తరలించారు అనంతరం పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. మధ్యాహ్నం గ్యాంగ్ స్టర్లు హతమైనట్టు ప్రకటించారు.

మే నెలలో వీఐపీల సెక్యూరిటీ విషయంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యేలు, పదవులు లేని రాజకీయ నాయకులకు సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. ఆ నిర్ణయం వెలువడిన మరుసటి రోజే.. మే 29న కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా(28) దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి జీప్ లో వెళ్తుండగా దారికాచిన దుండగులు సిద్ధూపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఈ ఇద్దరి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ రోజు వారిని పట్టుకునే క్రమంలో ఎదురుదాడిలో ఆ ఇద్దరూ హతమయ్యారు.

ప్రభుత్వంపై విమర్శలు..

ఈ ఎన్ కౌంటర్ వ్యవహారంతో పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. వీఐపీల సెక్యూరిటీ విషయంలో పంజాబ్ ప్రభుత్వం తాను చేసిన తప్పుని సరిదిద్దుకుంది. అయితే అంతలోనే మూసేవాలా హతమయ్యారు. దీంతో ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఇలా ఎన్ కౌంటర్ ని ప్రోత్సహించిందనే అపవాదు ఎదుర్కొంటోంది భగవంత్ మన్ ప్రభుత్వం.

First Published:  20 July 2022 11:53 AM GMT
Next Story