Telugu Global
National

ప్రియురాలి కోసం అమ్మాయి వేషంలో పరీక్షకు వెళ్ళాడు .. కానీ

పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో జరిగిన ఓ సంఘటన సినిమాల్లోని కామెడీ సీన్‌ ను మించి నవ్వించింది.

ప్రియురాలి కోసం అమ్మాయి వేషంలో పరీక్షకు వెళ్ళాడు .. కానీ
X

పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో జరిగిన ఓ సంఘటన సినిమాల్లోని కామెడీ సీన్‌ ను మించి నవ్వించింది. ప్రేమించిన అమ్మాయిని ఎలా అయినా పరీక్షలో పాస్ చేయించాల్సిన బాధ్యత తనదే అని ఫీలయిన ఓ వ్యక్తి, ఆమెకోసం ఏకంగా అమ్మాయి వేషం వేసుకుని తన స్థానంలో ప‌రీక్ష రాసేందుకు వెళ్ళాడు. ఎగ్జామ్ బాగా రాసి ఆమె పాస్ అయ్యేలా చేద్దాం అనుకున్నాడు. అయితే.. సినిమాల్లోలాగా నిజ జీవితంలో జ‌ర‌గదు క‌దా.. అత‌డి ప్లాన్ బెడిసి కొట్టింది. ఇంకేముంది జైలు పాలు అయ్యాడు.

వివరాల్లోకి వెళితే..

జ‌న‌వ‌రి 7 ఆదివారం రోజున మల్టీపర్పస్‌ హెల్త్ వర్కర్‌ పరీక్షను నిర్వ‌హించారు. బాబా ఫ‌రీద్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌రీక్ష జ‌రిగింది. ఈ ప‌రీక్ష కోసం పరమ్‌జిత్ కౌర్ అనే యువ‌తి ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఆమెకు కోట్క‌పురాలోని డీఏవీ పాఠ‌శాల‌లో ఎగ్జామ్ సెంట‌ర్ ప‌డింది. ఆమె స్థానంలో ప్రియుడు ఫ‌జిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్ ప‌రీక్ష రాయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు.

ప‌రీక్ష రోజున నుదుట తిల‌కం, పెదాల‌కు లిప్‌స్టిక్‌, ఎరుపు రంగు గాజులల‌తో పాటు లేడీస్‌ సూట్ వేసుకున్నాడు. అచ్చం అమ్మాయిలా రెడీ అయి ఎగ్జామ్ సెంట‌ర్‌కు వెళ్లాడు. పరీక్ష మొదలైంది. అమ్మాయి వేషధారణలో దిగిన ఫొటోతో తన గర్ల్‌ఫ్రెండ్‌ పరంజీత్‌ కౌర్ పేరిట తయారు చేయించుకున్న నకిలీ గుర్తింపు కార్డులను కూడా అధికారులు పసిగట్టలేకపోయారు. అయినా చివరికి అతని బండారం బయటపడింది. ఎలా అంటే ఇన్విజిలేటర్‌ ఒక్కొక్కరి దగ్గర బయోమెట్రిక్‌ తీసుకుంటూ అంగ్రేజ్‌ సింగ్‌ దగ్గరకు వచ్చాడు.

అంగ్రేజ్‌ సింగ్‌ వేలిముద్రలు అసలు క్యాండిడేట్ పరంజీత్‌ కౌర్‌ వేలిముద్రలు వేర్వేరు కావడంతో అసలు సరిపోలలేదు. అయితే అంగ్రేజ్ వేషం పకడ్బందీగా ఉండటంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం రాలేదు. సాంకేతిక సమస్యేమోనని పై అధికారుల దృష్టికి తీసుకుకెళ్లాడు. వాళ్లు వచ్చి వేలిముద్రలు వేయించి చూసినా మ్యాచ్‌ కాలేదు. దాంతో అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో బండారం బయట పడింది.

ఈ విష‌యం తెలిసి ప‌రీక్ష రాసేందుకు వ‌చ్చిన అభ్య‌ర్థుల‌తో పాటు అక్క‌డ ఉన్న వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. నవ్వాపుకోలేకపోయారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించిన పరంజీత్ కౌర్ కు మొదటికే మోసం వచ్చింది. ఆరోగ్య కార్యకర్త ఉద్యోగానికి ఆమె చేసుకున్న దరఖాస్తును అధికారులు రద్దు చేశారు.

First Published:  15 Jan 2024 9:30 PM IST
Next Story