Telugu Global
National

పంజాబ్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం..

ఆయుధాలను పట్టుకుని ఫోజులిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం నిషేధం. బ‌హిరంగ స‌భలు, ప్రార్థ‌నా స్థ‌లాలు, పెళ్లి వేడుక‌లు, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో ఆయుధాల‌ను తీసుకురావ‌డం, వాటిని ప్ర‌ద‌ర్శించ‌డం నిషేధం.

పంజాబ్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం..
X

పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వీఐపీల సెక్యూరిటీ సంస్కృతికి చరమగీతం పాడింది సీఎం భగవంత్ మన్ ప్రభుత్వం. అయితే ఆ నిర్ణయం వల్లే కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారనే విమర్శను కూడా ఎదుర్కొంది. సెక్యూరిటీని తీసేసే విషయంపై త్వరగా నిర్ణయం తీసుకున్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అదే సమయంలో అక్రమ గన్ కల్చర్ ని మాత్రం పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు దానిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు సీఎం భగవంత్ మన్.

బహిరంగ ప్రదర్శన నిషేధం..

గన్ కల్చర్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. ఇకపై తుపాకీ లైసెన్స్ ఉన్నవారు కూడా దాన్ని బహిరంగంగా ప్రదర్శించకూడదు. తుపాకీ సంస్కృతి, హింసను ప్రేరేపించే పాటలు కూడా విడుదల చేయకూడదు. ఇప్పటికే తుపాకీ లైసెన్స్ లు ఉన్నవారి అర్హతలు మరోసారి తనిఖీ చేస్తారు. మూడు నెలల్లో సమీక్ష చేపట్టి, అవసరం లేనివారి లైసెన్స్ లు రద్దు చేస్తారు.

ఆయుధాలను పట్టుకుని ఫోజులిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం నిషేధం. బ‌హిరంగ స‌భలు, ప్రార్థ‌నా స్థ‌లాలు, పెళ్లి వేడుక‌లు, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో ఆయుధాల‌ను తీసుకురావ‌డం, వాటిని ప్ర‌ద‌ర్శించ‌డం నిషేధం. అత్యవసరమైతే తప్ప ఇకపై ఎవరికీ కొత్తగా గన్ లైసెన్స్ లు ఇవ్వరు. పొరపాటున ఎవరికైనా గన్ లైసెన్స్ ఇచ్చినట్టు నిర్ధారణ అయితే వెంటనే దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత.. అమృత్ సర్ లో ఇటీవల శివసేన నేతను దుండగులు పట్టపగలే కాల్చి చంపారు, ఫరీద్ కోట్ లో డేరాబాబా అనుచరుడు ప్రదీప్ సింగ్ ని కొంతమంది కాల్చి చంపారు. దీంతో గన్ కల్చర్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

First Published:  13 Nov 2022 8:07 PM IST
Next Story