ఆ నదిలో నీళ్లు తాగి ఆస్పత్రిపాలైన సీఎం..
కడుపునొప్పితో బాధపడుతున్న సీఎం భగవంత్ మన్ ని ఆస్పత్రికి తరలించారు. చండీగఢ్ నుంచి హుటాహుటిన విమానంలో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి తరలించారు.
పంజాబ్ సీఎం భగవంత్ మన్ అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారనే విషయం తెలిసిందే. అయితే ఇందుకు కారణం కడుపు నొప్పి అని చెబుతున్నారు. కానీ.. ఆ కడుపు నొప్పికి వేరే కారణం ఉంది. కెమెరాల ముందు ఆయన చేసిన ఓ స్టంట్ ఇప్పుడు ఆయనకు అవస్థ తీసుకొచ్చింది. సుల్తాన్‌పూర్ లోధీలో పర్యటించిన ఆయన అక్కడి కాలీ బీన్ నది నుంచి నేరుగా ఓ గ్లాస్ నీరు తీసుకుని అందరూ చూస్తుండగానే తాగారు. అక్కడి వచ్చేవారు ఆ పవిత్ర నది నుంచి నీరు తాగడం ఆనవాయితీ. అయితే ప్రవహించే నది కాబట్టి ఓ గుక్కెడు నీటిని నోటిలో పోసుకుని మమ అనిపిస్తారు. కానీ సీఎం భగవంత్ మన్ ఏకంగా ఓ గ్లాస్ నీటిని గటగటా తాగేశారు. దీంతో కడుపులో తేడా చేసింది, ఆస్పత్రిపాలయ్యారు.
ఆ నీరు తాగిన మరుసటి రోజు ఆయన హుషారుగానే ఉన్నారు. బిజీ బిజీగా వివిధ సమీక్షలు చేశారు. కానీ సాయంత్రానికి ఏదో తేడా కొట్టేసింది. మంగళవారం రాత్రి చండీగఢ్ లోని తన అధికారిక నివాసంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సీఎం భగవంత్ మన్ ని ఆస్పత్రికి తరలించారు. చండీగఢ్ నుంచి హుటాహుటిన విమానంలో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స జరుగుతోంది. పూర్తి సెక్యూరిటీ లేకుండా ఆయన్ను వెంటనే విమానంలో తరలించాల్సి వచ్చింది కాబట్టి.. ఈ వ్యవహారాన్ని సీఎం కార్యాలయం గోప్యంగా ఉంచింది.
అంతా కాలీ బీన్ ప్రభావం..
కాలీ బీన్ నదిని శుద్ధి చేసి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం భగవంత్ మన్ సుల్తాన్ పూర్ లోధీకి వెళ్లారు. అక్కడ ప్రార్థనలు చేసి ఓ మొక్క నాటారు. అక్కడే కెమెరాలకు ఫోజులిస్తూ ఓ గ్లాస్ నీరు తాగారు. ఆ తర్వాత ఆ వార్త స్థానికంగా బాగా వైరల్ గా మారింది. సీఎం భగవంత్ మన్ కాలీ బీన్ నీటిని తాగారని మీడియా మొత్తం హైలైట్ చేసింది. నదులను ఎంత పరిశుభ్రం చేసినా, నేరుగా ప్రవహించే నీటిని తాగితే కాస్తో కూస్తో అనారోగ్యం కలగకమానదు. అదే ఇప్పుడు భగవంత్ మన్ ని ఇబ్బంది పెట్టింది. సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి, కడుపు నొప్పి వచ్చినా రాత్రికి రాత్రే విమానంలో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు.